Published On: Wed, Feb 13th, 2019

22న రాష్ట్రపతి నెల్లూరు జిల్లా పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈ నెల 22న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో అందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లన్నిటినీ పటిష్టంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలోని త‌న కార్యాలయంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వంటి అత్యంత ప్రముఖుల పర్యటనలకు సంబంధించి విధిగా చేయాల్సిన ఏర్పాట్లన్నిటినీ ఎలాంటి లోటుపాట్లకు లేదా పొరపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టవంతంగా చేయాల‌ని సంబంధిత శాఖల అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ప్రముఖులకు సంబంధించిన ఏర్పాట్లపై బ్లూ బుక్ ప్రకారం సక్రమంగా ఉందీ లేందీ పరిశీలించాలన్నారు. 22న రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో ఆపర్యటన సజావుగా జరిగేందుకు వీలుగా అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సాధారణ పరిపాలన శాఖ పరిశీలించాలని సిఎస్ స్పష్టం చేశారు. వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లన్నిటినీ ఎలాంటి పొరపాట్లకు లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ప్రోటోకాల్ అదనపు కార్యదర్శి కల్నల్ అశోక్‌బాబు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల వారీ తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి ఆర్.కె.మీనా, పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ శాంతి భద్రతలు మరియు కోఆర్డినేషన్ డిఐజి జి.శ్రీనివాస్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, నెల్లూరు జిల్లా ఎస్పి ఐశ్వర్య రస్తోగి, నెల్లూరు మున్సిపల్ కమీషనర్ ఆలీం భాషా, ఒఎస్డి సెక్యూరిటీ పివిఎస్ రామకృష్ణ, ఇంటిలిజెన్స్ సెక్యురిటీ వింగ్ ఎస్పీ టి.ఆర్.ప్రసాదరావు, సమాచారశాఖ ఇన్‌ఛార్జ్ అదనపు సంచాలకులు పి.కిరణ్‌కుమార్, చీఫ్ ఇన్పర్మేషన్ ఇంజనీర్ మధుసూదన, బిఎస్ఎన్ఎల్ డిజియం వి.ఎస్.నాగలింగేశ్వరరావు, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు పి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...