Published On: Thu, Oct 22nd, 2020

50 శాతం ర‌వాణా ఛార్జీ రాయితీ…

* ఢిల్లీకి బ‌య‌లుదేరిన తొలి కిసాన్‌ రైలు

* ములకల చెరువు రైల్వేస్టేషను నుండి కూరగాయల రవాణా ప్రారంభం

* ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గ‌జాన‌న్ మాల్య వెల్ల‌డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: గతంలో నడుపబడిన రెండు కిసాన్ రైళ్ళు విజయవంత‌మ‌వ‌డంతో అనంతపురం జిల్లా రైతులు మరియు వ్యాపారులు చూపుతున్న చొరవతో దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి 50 శాతం ర‌వాణా ఛార్జీ రాయితీతో తొలి కిసాన్ రైలు బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరిన‌ట్లు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గ‌జాన‌న్ మాల్య‌ తెలిపారు. న్యూఢిల్లీలోని ఆదర్శనగర్ రైల్వే స్టేషన్‌ మూడవ కిసాన్ రైలును నడపడం జరిగింద‌న్నారు. అనంతపురం జిల్లా నుండి నడుపబడుతున్న కిసాన్ రైళ్ళలో ఇది మూడవది. ఈ రైలు ద్వారా మొత్తం 242.6 టన్నుల సరుకులు రవాణా చేయబడినవి. భారత ప్రభుత్వం రైతులు తమ  యవసాయ ఉత్పత్తులను ఎటువంటి అవాంతరాలు లేకుండా, సురక్షితంగా మరియు వేగవంతంగా మార్కెటింగ్ చేసుకోవడంలో వీలును కల్పించడంతో పాటుగా రైతుల ఆదాయాన్ని మరింత మెరుగుపరచే దిశగా కిసాన్ రైళ్ళను ప్రారంభించడం జరిగింది. రైతులు ఈ రైలు రవాణా సౌకర్యాన్ని మరింత ఉపయోగించుకొనుటకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఇటీవలి కాలంలో “ఆపరేషన్ గ్రీన్స్ – టాప్ టు టోటల్” పేరిట గుర్తింపబడిన పండ్లు మరియు కూరగాయలను కిసాన్ రైళ్ళ ద్వారా రవాణా చేసే ఛార్జీల్లో 50% మినహాయింపును ప్రకటించింది. తదనుగుణంగా, కిసాన్ రైళ్ళ ద్వారా గుర్తింపు పొందిన పండ్లు మరియు కూరగాయల రవాణాకు మొట్టమొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వే రవాణా ఛార్జీల్లో 50% మినహాయింపును ఇవ్వడం జరిగింది మొదటి రెండు కిసాన్ రైళ్ళకు లభించిన గణనీయమైన ఆదరణ మరియు గుంతకల్లు డివిజన్ బృందం వారి మార్కెటింగ్ కృషి కారణంగా, చిత్తూరు జిల్లా రైతులు మరియు వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులను కిసాన్ రైళ్ళ ద్వారా రవాణా చేసుకునేందుకు ముందుకు రావడం జరిగింది. దీనికి అనుగుణంగా రైల్వే అధికారులు వెనువెంటనే స్పందించి అవసరమైన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా, ములకలచెరువు రైల్వే స్టేషన్‌ను ఈ నెల 20న పార్సిల్ లోడింగ్ కోసం గుర్తించడం జరిగింది. తొలిసారిగా (నాగ్‌పూర్‌)కు టమాటా పంటతో కూడిన రెండు పార్సిల్ వ్యాన్లు లోడ్ చేయబడినవి. దీనికి అదనంగా, అనంతపురం జిల్లాకు చెందిన రైతులు మరియు వ్యాపారులు అనంతపురం స్టేషను నుండి 10 పార్సిల్ వ్యాన్లలో 201 టన్నుల పండ్లు మరియు కూరగాయలను లోడ్ చేయడం జరిగింది. మొత్తమ్మీద, మూడవ కిసాన్ రైలులో (అనంతపురం నుండి 10, ములకలచెరువు నుండి 2) 12 పార్సిల్ వ్యాన్లు లోడ్ చేయబడినవి. వీటిలో నాగ్‌పూర్‌కు 4 మరియు మిగతా 8 పార్సిల్ వ్యాన్లు ఢిల్లీ (ఆదర్శనగర్)కి ఉద్దేశించబడినవి. లోడ్ చేయబడిన ఉత్పత్తులలో టమాట, కర్బూజా, బత్తాయి, నిమ్మకాయలు మరియు నారింజ వంటివి కలవు.మూడవ కిసాన్ రైలును విజయవంతంగా లోడ్ చేయడంలో గుంతకల్లు డివిజన్ అధికారులు చేసిన కృషికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్య సంతోషం వ్యక్తం చేసారు. ములకలచెరువు స్టేషన్‌లో లోడింగ్ పాయింట్ ప్రారంభించడం ఆ స్టేషను చుట్టుప్రక్కల ప్రాంత రైతులకు కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. గుర్తింపు పొందిన పండ్లు మరియు కూరగాయలను కిసాన్ రైళ్ళ ద్వారా రవాణా చేసే రైతులు మరియు వ్యాపారులకు రైల్వేల తరపున పూర్తి మద్దతు లభిస్తుందని పేర్కొన్న ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గజానన్ మాల్య “ఆపరేషన్ గ్రీన్ – టాప్ టు టోటల్” ద్వారా లభిస్తున్న స‌బ్సిడీని వినియోగించుకోవాల‌ని కోరారు.

Just In...