Published On: Tue, Aug 22nd, 2017

భార‌త‌దేశ యువ‌త‌లో నైపుణ్యత కొర‌త‌

* నాణ్య‌త బోధ‌న ఎంతో అవ‌స‌రం

* ఇన్నోవేష‌న్ మేనేజ్‌మెంట్ జాతీయ సద‌స్సు ప్రారంభోత్స‌వంలో వ‌క్త‌లు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: భార‌తదేశ యువ‌త‌లో నైపుణ్య‌త అనేది ఎంత‌గానో పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వివిధ దేశాల నైపుణ్య‌తా శాతాన్ని ప‌రిశీలిస్తే మ‌న దేశం యావ‌త్తూ ఆందోళ‌న చెందాల్సిన ప‌రిస్థితి నెలకొంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కిల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ సీఈవో కె.వి.స‌త్య‌నారాయ‌ణ అన్నారు. యూజీసీ, స్టార్ట‌ప్ స్విడ్ సౌజ‌న్యంతో పీబీ సిద్ధార్థ క‌ళాశాల సంయుక్తంగా మంగ‌ళ‌వారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రెండురోజుల ఇన్నోవేష‌న్ మేనేజ్‌మెంట్ నేష‌న‌ల్ సెమినార్‌ను అతిథులతో క‌ల‌సి ప్ర‌ధాన వ‌క్త‌గా విచ్చేసిన కె.వి.స‌త్య‌నారాయ‌ణ జ్యోతిప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తొలి రోజున జ‌రిగిన స‌ద‌స్సులో స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధిలో భార‌త‌దేశం 7 శాతం ఉండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం 12 శాతంగా ఉంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగాభివృద్ధి మాత్రం కేవ‌లం 2 శాతంగా ఉంద‌ని ఇది విచారించద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. భార‌త యువ‌త‌లో ఎక్కువ జ‌నాభా ఉన్న 15 నుండి 29 వ‌య‌స్కుల‌లో 30 శాతం మందికి ఉద్యోగంతో పాటు నైపుణ్య‌త కూడా కొర‌వ‌డింద‌న్నారు. నైపుణాభివృద్ధిలో ప్ర‌పంచ దేశాల‌తో పోల్చితే ద‌క్షిణ‌ కొరియాలో 98 శాతం యువ‌త నైపుణ్యాన్ని క‌లిగి ఉండ‌గా, అమెరికా 52 శాతం కాగా భార‌త‌దేశంలో ఇది కేవ‌లం 2 శాతంగా మాత్ర‌మే ఉంద‌ని ఇది దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం క‌ల్గించే అంశ‌మ‌ని తెలిపారు. ఇందుకు ముఖ్య కార‌ణాలు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లోపించ‌డం, నిర్వ‌హ‌ణ నైపుణ్యం లేక‌పోవ‌డం, భావ‌ప్ర‌క‌ట‌న నైపుణ్యం కొర‌వ‌డ‌డం వంటివి ప్ర‌ధాన అంశాల‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం యువ‌త‌కు మంచి అవ‌కాశాలున్నాయ‌ని వారు ఏకాగ్ర‌త‌, ఆస‌క్తితో తాము చేసే ప‌నిని ప‌రిశీల‌న చేయ‌డం ద్వారా అవ‌గాహ‌న పెంపొందించుకోవ‌చ్చ‌ని సూచించారు. మేక్ ఇన్ ఇండియా పిలుపు మేర‌కు వంద‌ల‌కొద్దీ అంకుర కేంద్రాలు నెల‌కొల్పిన‌ప్ప‌టికీ వాటి నుంచి వ‌చ్చిన ఆలోచ‌న‌లు 90 శాతం పైగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని వాటికి ముఖ్య కార‌ణం వినూత్న‌గా ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డం. న‌వ‌క‌ల్ప‌న‌కు అవ‌కాశం లేకుండా ఉండ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వ అతిథిగా పాల్గొన్న ఏపీ ఇన్నోవేష‌న్ సొసైటి సీఈవో ప్రొఫెస‌ర్ వి.వల్లీకుమారి మాట్లాడుతూ యువ‌తలో వంద‌ల‌కొద్దీ ఆలోచ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ అందులో అతి త‌క్కువ సంఖ్య‌లో కూడా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ల‌భించ‌డం లేద‌న్నారు. యువ‌త ముఖ్యంగా మ‌న చుట్టూ ఉండే స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకుని వాటికనుగుణంగా వినూత్న ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగాల‌న్నారు. విద్యార్థులు స‌మ‌య‌పాల‌న‌, అంకిత‌భావం, క‌ఠోర శ్ర‌మ, వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌ల‌తో ప‌లు రంగాల్లో విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఏపీ ఎన్నార్టీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డాక్ట‌ర్ వేమూరు ర‌వికుమార్ మాట్లాడుతూ ప్ర‌పంచ జ‌నాభాలో ఐదు బిలియ‌న్ల మంది ఇన్నోవేష‌న్‌కు బ‌దులుగా ఇమిటేష‌న్‌కే ఎక్కువ మ‌క్కువ చూపుతున్నార‌ని తెలిపారు. కానీ ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ఇన్నోవేష‌న్‌కే మ‌నుగ‌డ ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలి రోజున జ‌రిగిన స‌ద‌స్సులో ప‌లువురు అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొని ప‌రిశోధ‌న ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. కార్య‌క్ర‌మానికి సిద్ధార్థ అకాడెమీ అధ్య‌క్షుడు న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర్లు అధ్య‌క్ష‌త వ‌హించ‌గా పీబీ సిద్ధార్థ క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్‌, క‌ళాశాల డీన్ మ‌రియు స‌ద‌స్సు క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ రాజేష్ సి జంపాల‌, డైరెక్ట‌ర్ వేమూరి బాబూరావు, స్టార్ట‌ప్స్ స్విడ్ ప్ర‌తినిధులు శీలం శ్రీకృష్ణ‌, ప్రెస్ అండ్ మీడియా ఇన్‌ఛార్జ్ డాక్ట‌ర్ ఎండీఎస్ ర‌హెమాన్‌, దేశం న‌లుమూల‌ల నుంచి పెద్ద‌సంఖ్య‌లో అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌రిశోధ‌నా ప‌త్రాల‌ను పుస్త‌క రూపంలో ప్ర‌చురించి వేదిక‌పై ఆవిష్క‌రించారు.

pb_22-08-17_2 pb_22-08-17_4 pb_22-08-17_3 pb_22-08-17_1

Just In...