Published On: Wed, Sep 13th, 2017

పట్టణ పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి..!

* కనీస ఆదాయం ఆర్జించేలా సాయం

* ‘మెప్మా’ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాబోయే 2019 మార్చి నాటికి పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో పేద కుటుంబం ఏడాదికి కనీసం రూ.1.20 లక్షలు ఆర్జించేలా చూడటమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. పట్టాణాల్లోని 6 లక్షల పేద కుటుంబాలకు ముందుగా ఆర్ధిక స్థిరత్వం తీసుకురావడంతో పాటు వారికి విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, ఆహార భద్రత కల్పించాలని సూచించారు. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (ఎన్‌యుఎల్ఎం), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం స‌చివాల‌యంలో జరిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు 2014 నుంచి 2017 వరకు బ్యాంక్ లింకేజి కింద రూ.6,475.01 కోట్లు, వడ్డీ లేని రుణాలు రూ.239.81 కోట్లు ఇవ్వగా, 1,12,053 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించామని వారిలో 86,468 మందికి ఉపాధి దక్కిందని అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే 39,07,379 మందికి ‘చంద్రన్న బీమా’ కింద రక్షణ కల్పించామని,  ‘పసుపు-కుంకుమ’ పథకం కింద రూ. 975 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో కలిసి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు మెప్మా ప్రగతిని సమీక్షించారు.

mepma_100_smiles_book_3
ఓపెన్ స్కూళ్ల ద్వారా లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నత విద్యను అభ్యాసించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని, 36,167 మంది చిన్నారులకు కెరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టామని, మహిళలు-పిల్లలకు డిజిటల్, ఫిజికల్ లిటరసీలో శిక్షణ ఇస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆహారం, చేనేత, హస్తకళలు, సేవల రంగాలలో 336 జీవనోపాధి కార్యకలాపాలకు గల అవకాశాలు గుర్తించామని,  ఇప్పటికే 8.51 లక్షల యూనిట్లు నెలకొల్పేలా కృషి చేశామని అన్నారు. పట్టణ ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు న్యూట్రీ షాపుల ఏర్పాటును ప్రోత్సహించడం, 5 వేల మంది కమ్యూనిటీ హెల్త్ అసిస్టెంట్లను నియమించడం, 62 జనరిక్ మెడికల్ స్టోర్లను ప్రారంభించడం, కిచెన్ గార్డెన్, అర్బన్ అగ్రికల్చర్, పాఠశాలల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. హెల్త్ క్యాంపుల ద్వారా లక్షన్నర మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్రెస్ట్-సర్వైకల్ కేన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్టు అధికారులు చెప్పగా పట్టణాల్లో వున్న మొత్తం 20 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్…

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతా ఒకే పేరు, ఒకే లోగోతో  బ్రాండ్ తీసుకురావడం ద్వారా మార్కెటింగ్ సులభమవుతుందని పేర్కొన్నారు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు మార్కెట్ అందుబాటులో వుండటం కలిసొచ్చే అంశమని, ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే వినియోగదారులకు సరఫరా చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా మూడేళ్లలో 32 సార్లు మెప్మా బజార్లు ఏర్పాటు చేసిన అధికారులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

mepma_100_smiles_book_2 mepma_100_smiles_book_1mepma_100_smiles_book_4

Just In...