Published On: Wed, Sep 13th, 2017

నదుల పునరుజ్జీవనానికి నవ్యాంధ్ర సంపూర్ణ మద్దతు

* నదీ రక్షణ యాత్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: నదులను పునరుజ్జీవింప‌జేసి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అంద‌రిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నదులు రక్షణకు సద్గురు జగ్గీవాసుదేవ్ తీసుకున్న కార్యక్రమానికి తమ మద్దతు, సహకారం ఎప్పుడూ ఉంటాయని ప్రకటించారు. నదుల పునరుజ్జీవానికి ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్ర‌బాబు ప్రకటించారు. ఆర్ధికంగా సహాయం కావాలన్నా ఇస్తామని, నదుల చుట్టుపక్కల వనాలు పెంచడానికి సిద్ధమేనని, నదుల పునరుజ్జీవానికి ప్రపంచంలో అనుసరించిన ఉత్తమ పద్ధతులను అనుసరిస్తామని తెలిపారు. నదుల రక్షణ విధానానికి శ్రీకారం చుట్టే రాష్ట్రం తమదే అవుతుందని, విధాన పత్ర రూపకల్పనకు తమ రాష్ట్రమే మొదటిద‌వుతుందన్నారు. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో జగ్గీవాసుదేవ్  ప్రారంభించిన నదీ రక్షణ యాత్ర  సెప్టెంబ‌రు 13న (బుధవారం) విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడ మొగ‌ల్రాజ‌పురంలోని  పి.బి. సిద్ధార్ధ కళాశాల ప్రాంగణంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రrally_for_rivers_vij_13-09-17_8సంగించారు.

నేడు తాను ఇద్దరు ప్రముఖులతో వేదిక పంచుకుంటున్నానని, ఒకరు జలసంరక్షణ ఉద్యమ స్ఫూర్తిదాత రాజేంద్రసింగ్ కాగా మ‌రొక‌రు సద్గురు జగ్గీవాసుదేవ్ అని అభివర్ణించారు. 1995 సంవత్సరంలో ఆ సమయంలో నదుల పునరుజ్జీవానికి జలసంరక్షణకు స్ఫూర్తినిస్తున్న రాజేంద్రసింగ్‌తో కలసి పనిచేశామని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు. స్వర్ణముఖి నదిని పునరుజ్జీవింపజేయడానికి చేసిన కృషిని గుర్తు చేశారు. జగ్గీవాసుదేవ్ దేశానికి అవసరమైన మానవీయకోణం, మంచి సంకల్పంతో నదుల రక్షణ యాత్ర చేపట్టారని చంద్రబాబు ప్రశంసించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నదులకు కృతజ్ఞత తెలిపేందుకు, మన బాధ్యత గుర్తు చేయడానికి అఖండ హారతి నిర్వహించామని, కృష్ణా పుష్కరాల సందర్భంలో పవిత్ర హారతి ప్రవేశపెట్టామన్నారు.
రాజేంద్రసింగ్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ‘ మీరు నాకు మంచి మిత్రులు. వాజ్ పేయి ప్రభుత్వ కాలంలో నదుల అనుసంధానానికి మనం కలసి పనిచేశాం. ఈ దేశాన్ని పీడించేవి కరవులు, వరదలు రెండే రెండు. వీటిని నిరోధించాలంటే నదుల అనుసంధానమే పరిష్కారం అని నాడు ప్రధాని వాజపేయీకి వివరించగా ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు కేంద్రమంత్రిగా ఉన్నసురేష్ ప్రభు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వేయడానికి నిర్ణయించారు.  కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నదుల అనుసంధానం, టాస్క్ ఫోర్సు, తదితర అంశాలను నిర్లక్ష్యం చేశాయి’ అని చంద్రబాబు అన్నారు. ఈ సమస్య మీద ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తాను ఒక్కటే అడుగుతున్నానని, వారితో ఏకీభవిస్తున్నానని, నదుల అనుసంధానం తాత్కాలికమైనదేనని, కానీ నదుల పునరుజ్జీవనం శాశ్వతమైన పరిష్కారం అని తెలిపారు. నదులను రక్షించాలనడంలో జగ్గీవాసుదేవ్ సెంటిమెంట్‌ను తాను నేను గౌరవిస్తానని చెబుతూ.అదే సమయంలో తక్షణ పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన చేశామంటే ఇదొక చరిత్ర అని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాని కాపాడుకోగలిగాం. రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో 20, మధ్య కోస్తాలో 18, దక్షిణకోస్తాలో 12, రాయలసీమలో 19 నదులున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. వీటిని పునరుజ్జీవింజేస్తే రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊపు వస్తుందన్నారు. దేశంలో జలసంరక్షణ ఉద్యమ మార్గదర్శి రాజేంద్రసింగ్‌ను ఉద్దేశించి ప్రత్యేకంగా చెబుతూ రాష్ట్రంలో 40,817 చెరువులు, 50,587 చెక్ డ్యాములు నిర్మించామి వివరించారు. 6 లక్షల 20 వేల సేద్యపుకుంటలు తవ్వామని చెప్పారు. భూగర్భంలోకి జలాలు చేరేలా 54,000 ఇంకుడుగుంతలను తవ్వించామని ముఖ్యమంత్రి వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 16 లక్షల గొట్టపుబావులు వేయించామని, అన్ని స్థాయులలో కలపి 1140 ఎత్తిపోతల పథకాలున్నాయని చెప్పారు. వీటన్నింటి ఉద్దేశం ప్రజలకు జీవనాధారాన్ని సుసంపన్నం చేయడమేనన్నారు.  అది తమ నిబద్ధతకు నిదర్శనమని చంద్రబాబు వివరించారు.దేశంలో, రాష్ట్రంలో ఇప్పటికీ 65% మంది వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్నారని చెప్పారు. ఇది దేశ జలసంరక్షణలో ఒక రాష్ట్రం తీసుకున్న చర్యలలో చాలా ఎక్కువ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడే ఒడిసిపట్టి సంరక్షించాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పుడు భూగర్భ జలమట్టం 11.77 మీటర్లుందని, గడచిన మేలో 14.79 మీటర్లుండేదని చెప్పారు. రాయలసీమలో 18.5 మీటర్లుగా ఉందన్నారు. కోస్తాంధ్రలో 8.78 మీటర్లుందని వివరించారు. మూడు మీటర్లలోపే నీరు లభించే ప్రాంతం 21% ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  8 మీటర్లలోతులో లభించే నీరున్న ప్రాంతం 28%, అలాగే   51% 8 మీటర్లకంటే పైన ఉండే అవకాశం వుందని గణాంకాలను ముఖ్యమంత్రి వివరించారు. జగ్గీ వాసుదేవ్ వివరించినట్లు దేశంలో నదులు పూర్తిగా శుష్కించిపోయే దశలో ఉన్నాయని, కృష్ణానది పూర్తిగా ఎండిపోయే ప్రమాదంలో పడిందని, రాష్ట్రానికి నీరుకూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. దేశంలో ప్రధాన నదుల నుంచి నీరు 85%, మధ్యతరహా నదుల నుంచి 7% సములోకి వెళ్లిపోతున్నాయని, బంగాళాఖాతంలోకి  77%, అరేబియా సముద్రంలోకి 33% నీరు వెళ్లిపోతోందన్నారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందని గుర్తుంచుకోవాలని సూచించారు. జలవనరులపై ప్రజల్లో అవగాహన, కృతజ్ఞతాభావం పెంపొందించేందుకు  ఏరువాకను ఒక రాష్ట్ర పండుగగా చేశామని, వనం-మనం కార్యక్రమాన్ని రాష్ట్ర వేడుకగా అమలుచేశామని, మరోవైపు ‘జలసిరికి హారతి’తో ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన విషయాన్నిగుర్తుచేశారు. నేడు కష్ణా నదిలో 60 శాతం నీరు తగ్గిపోయిందని, కావేరిలో 40 శాతం,  నర్మదలో 60 శాతం, గంగానదిలో 40 శాతం తగ్గిపోయిన విషయం ఆందోళన కలిగిస్తోందన్నారు. నదులను వాటి స్థితికి వాటిని వదలివేస్తే అన్ని నదులు పూర్తిగా  ఎండిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వసాయదారులు కూడా ప్రాంతాలకు అనుగుణంగా  పంటల మార్పిడి విధానం పాటించాలని, నీరు తక్కువగా అవసరమయ్యే తోట పంటల వైపు మళ్లాలని, వియత్నాం దేశంలో రైతులు వరి పంట నుంచి ఉద్యానపంటల సాగుకు వెళ్లి 20 రెట్లు అధికాదాయం సాధించిన అంశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల భూమి ఉందని, కోటి ఎకరాల్లో పండ్ల తోటలుండాలని, మరో కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఉండాలని అన్నారు. జల సంరక్షణ ఎంత ముఖ్యమో, జలనిర్వహణ కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్ర‌బాబు స్పష్టం చేశారు. జగ్గీవాసుదేవ్ 16 రాష్ట్రాలలో 4 వేల కి.మీ మేర యాత్ర చేపట్టారని, ఇదెంతో స్ఫూర్తినిచ్చే యాత్ర అని, ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. న‌దీజ‌లాలు ఎండిపోకుండా నీటిని కాపాడుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిఒక్క‌రితోనూ ప్ర‌తిజ్ఞ చేయించారు.
సద్గురు జగ్గీవాసుదేవ్ మాట్లాడుతూ ‘అందరికీ వందనములు’ అంటూ తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నదుల రక్షణను, తమ యాత్ర ఉద్దేశాలను వివరించారు. బాల్యం నుంచి తాను ప్రకృతితో మమేకం అయ్యాన‌ని, నదులు, అడవులు, పర్వతాలతో తనకు అనుబంధం ఉందన్నారు. ప్రత్యేకించి కావేరీనదితో అనుబంధం ఎక్కువని, ఈ నది తీరాననే జన్మించానని, పెరిగానని, 17 ఏళ్లు వచ్చేదాకా కావేరీనదిలో ఈత కొట్టానని ఆయ‌న గుర్తుచేసుకున్నారు. ఆ నదిని తానొక జలవనరుగానే చూడటం లేదని, జీవితాన్ని దర్శించానన్నారు. లక్షలాది మందికి జీవనాధారంగా మారిన నది కావేరీ అని అభివర్ణించారు. గడ‌చిన 25 ఏళ్లుగా కావేరి సహా అన్ని ప్రధాన నదులు శుష్కించి, ఎండిపోవటం కళ్లారా చూశానని, గత ఏడెనిమిదేళ్లలో నదులు ఎండిపోయే ప్రమాదం మరింతగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2030 తర్వాత అనేక ప్రధాన నదులు సీజనల్ నదులుగా మారే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తు చేశారు. నదుల పరిరక్షణకు నదులకు ఇరువైపులా ప్రభుత్వ, రైతుల భూములలో వనాలు, చెట్లు పెంచాలని తద్వారా నదుల సంరక్షణకు మార్గం ఏర్పడుతుందని చెప్పారు. నదులకు ఇరువైపులా ప్రభుత్వ భూమి 25% ఉంటుందని, మిగిలన భూమి రైతులది అయితే ఉద్యాన పంటలకు సంబంధించి విలువైన మొక్కలు పెంచవచ్చని చెప్పారు. నదుల రక్షణకు దేశవ్యాప్త విధానం అవసరమని, ఇందుకు చట్టం చేయాల్సి ఉందన్నారు, ఇందుకు ఆంధ్రప్రదేశ్ సహా తాను యాత్ర చేయబోయే రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ తమకు సానకూలంగా మాట్లాడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది సహా దేశంలోని పలు ప్రధాన నదులు రానున్న 25 ఏళ్లలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు.
సాధారణంగా తాను ఎవరినీ పొగడనని, భగవంతుని దేశంగా పిలిచే కేరళను సందర్శించానని, అక్కడ పచ్చదనం, జలవనరులను అనుసరించే భగవంతుని దేశం అంటున్నారని, చెన్నయ్ తర్వాత, అమ్మో విజయవాడ వెళ్తున్నామా, అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అనుకున్నామని, ఆంధ్రకు వచ్చినప్పడు కొంచెం వేడి ఉన్నప్పటికీ ఆహ్లాదంగా ఉందని, ఇక్కడా జలవనరులు అనేకం కన్పించాయని, జాతీయ రహదారికి ఇరుపక్కలా పచ్చగా ఉందని. మధ్యలో పుష్పాల మొక్కలతో వర్ణశోభితంగా ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో 50% పచ్చదనం తీసుకురావటం తమ ధ్యేయమని చెప్పారని, ఇవాళ చంద్రబాబు చేసింది దేశమంతా చేయాల్సి ఉందని కొనియాడారు.
ఆరావళి పర్వతశ్రేణుల మధ్య ఎడారి లాంటి రాజస్థాన్‌లో జలతరంగిణులను సృష్టించిన ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ నదులను సంహరించే మనమే వాటి పునరుజ్జీవనానికి కృషి చేయాల్సి ఉందన్నారు. నదుల పక్కల కట్టడాలు సరికాదన్నారు. నదుల పరిరక్షణ తక్షణ కర్తవ్యమన్నారు. సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, డాక్ట‌ర్ కామినేని శ్రీనివాస్, జడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ గద్దె అనూరాధ, విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొని న‌దుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌సంగించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్ ఎల్‌.వి.ఎస్‌.ఆర్‌.కె.ప్ర‌సాద్‌, మ‌హిళా ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ పంచుమ‌ర్తి అనూరాధ‌, స్థానిక తెదేపా నాయ‌కులు దేవినేని అవినాష్‌, రామ‌కృష్ణ ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

rally_for_rivers_vij_13-09-17_10 rally_for_rivers_vij_13-09-17_7 rally_for_rivers_vij_13-09-17_6 rally_for_rivers_vij_13-09-17_5 rally_for_rivers_vij_13-09-17_4 rally_for_rivers_vij_13-09-17_3 rally_for_rivers_vij_13-09-17_9 rally_for_rivers_vij_13-09-17_2 rally_for_rivers_vij_13-09-17_1

Just In...