Published On: Tue, Apr 10th, 2018

అమ‌రావ‌తి శిగ‌లో.. ఆనంద న‌గ‌రి..!

* దేశంలోనే వైబ్రెంట్ నగరంగా అమ‌రావ‌తి 

* సంతోష నగరాల స్పూర్తితో అమ‌రావ‌తి న‌గ‌రాన్ని తీర్చిదిద్దుతాం

* ఆనంద న‌గ‌రాల స‌ద‌స్సు-2018 ప్రారంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

* దేశ‌, విదేశాల నుంచి ప్ర‌తినిధుల హాజ‌రు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్రజల ఆనందం కోసం అమరావతి రాజధానిలో అభివృద్ధి ఉండేలాగా నిర్మాణం చేస్తామని అందుకు ఆనంద నగరాల సదస్సు వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆనంద నగరాల సదస్సు-2018ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్రపంచ సంతోష నగరాల సదస్సును తొలిసారి అంతర్జాతీయంగా అమరావతి రాజధానిలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రపంచంలో మొదటి దేశంగా ఫిన్‌ల్యాండ్ వరల్డ్ హ్యాపీయస్ట్ దేశంగా నిలిచిందన్నారు. ఫిన్‌ల్యాండ్ నుంచి ఎక్కువమంది ప్రతినిధులు సంతోష నగరాల సదస్సులో పాల్గొనడం విశేషమన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా సింగపూర్ దేశం ఉందని ఎక్కువమంది సింగపూర్ వెళ్లి నివసించాలని అనుకుంటారని తెలిపారు. అటువంటి సింగపూర్ నగరం మన అమరావతి రాజధానికి బృహత్తర ప్రణాళికను అందించడం జరిగిందన్నారు. రాజధాని నిర్మించడం అంటేనే పెద్ద సవాళ్లని, విభజనకు పూర్వం హైదరాబాదులో సైబరాబాద్ పేరుతో బ్రౌన్ ఫీల్డ్ సిటీని నిర్మించిన అనుభవం ఉందన్నారు. విభజన అనంతరం సొంతగడ్డపై అడుగు పెట్టిన తొలిరోజుల్లో బస్సు నుంచే పాలన ప్రారంభించానని తర్వాత రాజధాని నిర్మాణానికి భూముల కోసం ఒక పిలుపుతో రైతులు ముందుకొచ్చి 35 వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణంలో రైతులు, రైతు కూలీలందరు సహకరించారని దీంతో సమిష్టితో కూడిన విజయం దక్కిందన్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ సంతోష్ నగరం ఫిన్ల్యాండ్ అని దాని తరువాతి స్థానంలో నార్వే తదితర దేశాలు ఉన్నాయన్నారు. 21వ శతాబ్దం టెక్నాలజీదేనని, 3వ పారిశ్రామిక విప్లవంతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోయిందన్నారు. ఇప్పుడు నాల్గొవ పారిశ్రామిక విప్లవం ఐవోటి నడుస్తోందని, ఐటీ నుంచి ఐవోటి దగ్గరకు వచ్చామన్నారు. మోస్ట్ హ్యాపియెస్ట్ సిటీ నిర్మాణం ఎలా అనే అంశంపై మూడురోజుల పాటు చ‌ర్చ జరుగుతోందని పేర్కొన్నారు. చర్చల ద్వారా అందరూ రాజధాని నిర్మాణానికి అవసరమైన విలువైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. భారతదేశంలో తొలిసారి ఆనంద నగరాల గురించి చర్చ అమరావతిలో జరుగుతోందని, ఇప్పటికే తాము రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలలో ఆదివారాల్లో ఆనందదాయక కార్యక్రమాలను ప్రజలు సంతోషంగా గడపడానికి నిర్వహిస్తున్నామన్నారు. ఆనందంగా ఉండాలంటే కేవలం డబ్బులు ఖర్చు పెడితే సరిపోదని మనిషికి మానసిక ఆనందం కూడా ముఖ్యమేనన్నారు. స్మార్ట్ సిటీస్ నిర్మాణ సహకారానికి యునైటెడ్ కింగ్డమ్‌తో దేశం ఎంవోయూ కుదుర్చుకుందని అందులో అమరావతి రాజధాని ఒకటిగా ఉందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంతోషదాయకమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాల నుంచి సహకారం తీసుకుంటున్నామన్నారు. ప్రపంచంలో నివాసయోగ్యమైన సంతోష నగరాలను స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నగరాన్ని తీర్చిదిద్దడానికి ఇలాంటి సదస్సులు వేదికగా ఉపయోగించుకుంటామన్నారు. నూతన ఆవిష్కరణలకు రాజధానిలో ప్రాముఖ్యం ఇస్తామని, మూడు రోజుల సదస్సులో పిచ్ కాంపిటేషన్స్ నిర్వహిస్తున్నామని, ఒక ఐడియా ప్రపంచం మొత్తాన్ని మార్చివేస్తుందన్నారు. అమరావతి రాజధానిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామని దేశంలో అమరావతిని వైబ్రెంట్ నగరంగా నిర్మిస్తామన్నారు. 10 ఏళ్ల క్రితం ఎవరూ హ్యాపీనెస్ గురించి ఆలోచించలేదని అభివృద్ధిపైనే అందరూ మాట్లాడేవారని ఇప్పుడు పరిస్థితులు మారాయని, వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తుతరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాజధాని ప్రక్కనే కృష్ణానది మంచినీటితో ప్రవహించడం ఈ ప్రాంతానికి ఒక వరమన్నారు. నీరు శక్తిని ఇస్తుందని ఆ నీటితో అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం గ్రీనరీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని, భూటాన్ దేశంలో 70 శాతం గ్రీన‌రీకి అక్క‌డి పాల‌కులు ప్రాముఖ్యం ఇస్తున్నార‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పి.నారాయ‌ణ, సెంట‌ర్ ఫ‌ర్ లివ‌బుల్ సిటీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్ టెంగ్‌చే, భూటాన్ దేశ గేలెపు న‌గ‌ర మేయ‌ర్ టిక‌ర‌మ్ కాప్లీ, మౌలిక వ‌స‌తుల ముఖ్య కార్య‌ద‌ర్శి అజ‌య్‌జైన్‌, ఈశా ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్‌, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ప్త‌త్తిపాటి పుల్లారావు, పితాని స‌త్య‌నారాయ‌ణ‌, న‌క్కా ఆనంద‌బాబు, ఎమ్మెల్యేలు శ్రావ‌ణ‌కుమార్‌, గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్‌, విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌ర్ డి.గౌతం స‌వాంగ్‌, సీఐఐ ప్ర‌తినిధులు, దేశ విదేశాల నుంచి ప్ర‌తినిధులు, రాజ‌ధాని రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...