Published On: Mon, Apr 23rd, 2018

వైభవంగా కోదండరాముని పుష్పయాగం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తుల‌కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.  మధ్యాహ్నం 3.00 గంటలకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా ప్రారంభ‌మైంది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ప‌త్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. శ్రీ కోదండ రామాలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్స‌వాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో లేదా నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శేషారెడ్డి, ముర‌ళీకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.

Just In...