Published On: Wed, May 9th, 2018

మౌలిక వసతులకు ప్రథమ ప్రాధాన్యం

* నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతి ఇది

* రాబోయే రోజుల్లో లక్ష్యాలివి..

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాబోయే రోజులకు గాను మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సంతృప్తి స్థాయికి చేరుకునేలా సంపూర్ణ మౌలిక వసతుల కల్పనను తొలి ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనను రెండో ప్రాధాన్య అంశంగా, ఆరోగ్యం- పౌష్టికాహారం మూడో ప్రాధాన్య అంశంగా భావిస్తున్నారు. తయారీరంగాన్ని కూడా ప్రాధాన్య అంశాల జాబితాలో చేర్చారు.  2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ప్రాధాన్య అంశాలేమిటో మంగళవారం ఇక్కడ జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 11.39 శాతం వృద్ది రేటుతో రాష్ట్ర జీవీఏ రూ.5,48,439 వుండగా, జాతీయ స్థాయిలో అది 6.4 శాతం వృద్ధి రేటుతో రూ.1,19,64,479గా ఉంది. 2017-18లో 11.22 వృద్ధి రేటుతో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.6,07,388గా వుండగా, అదే జాతీయస్థాయిలో 6.6 శాతం వృద్ధి రేటుతో రూ.1,30,03,897గా వుంది. 2017-18లో వ్యవసాయ, అనుబంధ రంగాలలో వృద్ధి రేటు రూ.1,63,635 జీవీఏతో 17.76 శాతం నమోదు కాగా, అదే జాతీయస్థాయిలో వృద్ది రేటు 3.0 శాతంగా ఉంది. 2017-18లో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు 1,42,837 జీవీఏతో 8.49 శాతం నమోదు కాగా, జాతీయస్థాయిలో 4.8 శాతం వృద్ధి రేటు వుంది. 2017-18లో సేవారంగంలో వృద్ధి రేటు 2,41,967 జీవీఏతో 9.11 శాతం నమోదు కాగా, జాతీయస్థాయిలో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. 2017-18లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,42,054 గా ఉంటే, జాతీయస్థాయిలో తలసరి ఆదాయం రూ.1,12,764గా వుంది.
                    2018-19లో వృద్ది రేటు లక్ష్యాన్ని 15.91 శాతంగా నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) లక్ష్యాన్ని రూ.6,35,692గా తీసుకున్నారు. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలతో కలిపి ప్రాథమిక రంగంలో 22.66శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు. అందులో ఒక్క వ్యవసాయ రంగంలో 15.02 శాతం, ఉద్యాన రంగంలో 25.01 శాతం, పశు సంవర్ధకంలో 20.02 శాతం వృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తం పారిశ్రామిక రంగంలో 13.07 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు. అందులో మైనింగ్‌, క్వారీయింగ్‌లో 14.63 శాతం, తయారీరంగంలో 13.96 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాలలో 12.96 శాతం, నిర్మాణరంగంలో 11.22 శాతం చొప్పున లక్ష్యాలను నిర్ణయించారు. సేవారంగం విషయానికి వస్తే, ఈ రంగంలో అన్ని విభాగాలు కలిపి 15.91 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నారు.
                   నీతిఆయోగ్ సూచికల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన మైలురాళ్లను కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు.  వ్యాపార సంస్కరణ కార్య ప్రణాళిక అమలులో (బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌)లో నూరుశాతం స్కోరుతో రాష్ట్రం తొలి ర్యాంకు సాధించడం విశేషం. వ్యవసాయోత్పత్తుల విపణి-రైతులతో స్నేహపూరిత సంస్కరణల సూచికలో (అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016)లో 56.2 స్కోరుతో ఏపీ 7వ ర్యాంకు సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఆరోగ్యరంగ ప్రగతి సూచిక (పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016)లో 0.62 శాతం స్కోరుతో మన రాష్ట్రం 10 వ ర్యాంకులో ఉన్నట్టు వివరించారు. తాజా ఆరోగ్య సూచిక (హెల్త్ ఇండెక్స్ 2018)లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు సాధించామని ప్రకటించారు. పాఠశాల విద్య ప్రమాణాల సూచిక (స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016)లో 56 శాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 17 వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతిని అధికారులు కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. రాష్ట్రంలో అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్లను అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు చేస్తున్నామని తెలిపారు. 80శాతం శివారు గ్రామాలన్నీ 0.5 శాతం పరిధిలో రహదారులకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. 30,500 కిలోమీటర్ల మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు. 2018-19లో 9,765 గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. 24,783 శివారు గ్రామాల ప్రజానీకానికి ఒక్కొక్కరికీ 55 లీటర్ల చొప్పున మంచినీటి సరఫరా లక్ష్యంగా నిర్దేశించారు. 10,754 గ్రామ పంచాయతీలో ఎల్ఈడీ వీధి దీపాల సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 10,344 శివారు గ్రామాలలో బీటీ రహదారులను ఏర్పాటు చేయాలన్న కొత్త లక్ష్యాన్ని ప్రకటించారు.
           మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017-18లో రాష్ట్రంలో 1,69,838 పంటకుంటల తవ్వకాన్ని పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 5,07,651 పంటకుంటలు తవ్వినట్టు తెలిపారు. 2017-18లో రాష్ట్రంలో మొత్తం 1,64,023 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే, గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 65,794 వర్మీ/ఎన్ఏడీఈపీ కంపోస్టు పిట్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 1,86,917 పిట్స్ ఏర్పాటయినట్టు అధికారులు వివరించారు.
            2017-18లో రాష్ట్రంలో 2589 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 4066 అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2017-18లో రాష్ట్రంలో 10,244 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 19,669 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ పూర్తిచేశారు. 2017-18లో రాష్ట్రంలో 6039 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల నిర్మాణం జరగగా, నాలుగేళ్లలో మొత్తం 16,729 కిలోమీటర్లలో సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 43 మండలాలలో మండల కార్యాలయ భవనాల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నాలుగేళ్లలో 365 మండలాలకు సొంత భవనాలు సమకూరాయి. 2017-18లో రాష్ట్రంలో 448 గ్రామ పంచాయతీలకు భవనాలు ఏర్పాటుచేశారు. ఈ నాలుగేళ్లలో 1677 గ్రామాలకు పంచాయతీ భవనాలు సిద్ధమయ్యాయి. 2017-18లో రాష్ట్రంలో 84,271 ఎకరాలలో ఉద్యాన పంటల సాగు చేపట్టారు. అలాగే, కొత్తగా 669 స్మశాన వాటికల్ని ఏర్పాటుచేశారు. నాలుగు సంవత్సరాలలో మొత్తం 722 స్మశానవాటికల ఏర్పాటు పూర్తయ్యింది. గత ఆర్థిక సంవత్సరంలో 17.5 శాతంగా ఉన్న అండర్ వెయిట్ శిశువుల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 11.3 శాతానికి తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఐఎంఆర్ రేటు ప్రతి వెయ్యి జననాలకు 41గా ఉంటే, రాష్ట్రంలో ఈ రేటు 29-35 మధ్యన వుంది. దేశంలో ఎంఎంఆర్ రేటు ప్రతి లక్ష జననాలకు 167గా వుంటే, రాష్ట్రంలో దీని రేటు 61-113 మధ్యలో వుండి తొలి మూడు రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.
            పారిశ్రామిక రంగంలో 12 శాతం సుస్థిర వృద్ధి సాధించాలంటే 2020 మార్చి వరకు నెలనెలా రూ.21 వేల కోట్ల మేర ఉత్పత్తి దశకు వెళ్లాలని లక్ష్యంగా నిర్ణయించారు. 15.7 శాతం సరాసరి వార్షిక వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలంటే 6.3 లక్షల కోట్ల మేర పారిశ్రామిక ఉత్పత్తి జరగాలని నిర్దేశించారు.

Just In...