Published On: Sat, May 12th, 2018

ఈ నెల 14 నుండి ఇంట‌ర్ సప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌లు

* కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 14 నుండి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ సంద‌ర్భంగా శనివారం ఉద‌యం త‌మ విడిది కార్యాలయంలో ఆర్ఐవో, రెవెన్యూ, అధికార్లతో సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ 85 పరీక్షా కేంద్రాలలో సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని, వాటిలో అర్బన్‌లో 49 సెంటర్లు, రూరల్‌లో 36 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు ప్రతిరోజు మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ అన్నారు. ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రామారావును కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. పోలీస్ శాఖ పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖ, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు.

Just In...