Published On: Tue, May 15th, 2018

మున్సిపల్ వార్డులకూ రేటింగ్‌లు

* 2019 జూన్ నాటికి వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి

* తాగునీటి కొరత రానివ్వొద్దు

* మురికివాడలు లేని ఏపీయే లక్ష్యం 

* సీఎస్ దినేష్‌కుమార్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: పంచాయతీల మాదిరిగా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ వార్డులకూ పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై మున్సిపల్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పురపాలక ప్రజారోగ్యం, విద్య, పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టిన పలు వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వెల‌గ‌పూడి సచివాలయంలోని తన కార్యాలయంలో మున్సిపాల్టీలో చేపట్టిన పథకాల తీరుతెన్నులపై సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో ఉన్న పురపాలక ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని ఆ శాఖ డైరెక్టర్ కన్నబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్‌కు వివరించారు. రాష్ట్రంలో నగరాల సుందరీకరణ, మున్సిపల్ ప్రాంతాల్లో డివైడర్ల మధ్య మొక్కల పెంపకంపై వీడియోలను ప్రదర్శించారు. అనంతరం సీఎస్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణాల్లో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చూపొద్దని హెచ్చరించారు. పరిశుద్ధమైన నీటిని అందజేయాలని, అసరమైతే ప్ర‌భుత్వం ఎన్ని కోట్లైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా లీకేజీలు అరికట్టాలని, ఇందుకోసం సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లెక్కించడం ద్వారా సులువుగా లీకేజీలను లెక్కించొచ్చన్నారు. తాగునీటిని సరఫరా చేసే సిబ్బంది పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. వర్షపు నీటితో పాటు వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి, ఇతర అవసరాలకు వినియోగించాలన్నారు. రాష్ట్రంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మార్పుచేయడం ద్వారా 20 శాతం మేర అడ్మిషన్లు పెరిగాయని మున్సిపల్ డైరెక్టర్ కన్నబాబు తెలిపారు. దీనిపై సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు అందుబాటులో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలన్నారు. పిల్లల బరువు, ఎత్తుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రా పౌట్లు నిరోధించాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలిపోకుండా నిరోధించాలన్నారు. ఇందుకోసం మున్సిపల్ పాఠశాలలో నాణ్యమైన విద్య అందివ్వడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎస్ ఆదేశించారు. గత మార్చి నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మున్సిపల్ పాఠశాలలు 90.40 శాతం మేర ఫలితాలు సాధించడంపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలల ఆవరణలో కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ సాగుతున్న తీరును సీఎస్ అడిగి తెలుసుకున్నారు.
2019 జూన్ నాటికి వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులు పూర్తి కావాలి…
రాష్ట్రంలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 7 ప్రాజెక్టులను, 45 వేస్ట్ కంపోస్టు ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సీఎస్ కు వివరించారు. దీనిపై సీఎస్ దినేష్ కుమార్ స్పందిస్తూ, వేస్ట్ మేనేజ్ మెంట్ కింద చేపట్టిన ప్రాజెక్టులనీ వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడలో సాగునీటి కాలువల సుందరీకరణ పనులు వేగవంతం చేయలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పాలిథీన్ బ్యాగ్ ల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీ తీరుతెన్నులను అధికారులు సీఎస్ కు వివరించారు. మున్సిపల్ వార్డులకు రేటింగ్‌లు…
ఇటీవల పంచాయతీలకు అందజేసిన మాదిరిగా మున్సిపల్ వార్డులకూ రేటింగ్ లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. ఆయా వార్డుల పనితీరు ఆధారంగా 100 మార్కులకు ఈ రేటింగ్ లు ఇవ్వాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు 20 మార్కులు, పలు వేస్ట్ మేనేజ్ మెంట్ పథకాల అమలుకు 25, విద్యకు 15, ఆరోగ్యానికి 15, రోడ్లు, విద్యుద్దీపాల నిర్వహణ, పచ్చదనానికి ఇతర మార్కులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
మురికివాడల్లేని ఏపీయే లక్ష్యం…
ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణల ప్రగతిని సీఎస్ దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. మురికి వాడల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పట్టణ ప్రజారోగ్యం, విద్య, పౌష్టికాహారం పంపిణీ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వళవన్, మెప్మా ఎం.డి.చినతాతయ్య, ఏపీ టిడ్కో ఎం.డి.దివాన్ మైదీన్ తదితరులు పాల్గొన్నారు.

Just In...