Published On: Tue, May 15th, 2018

పియంకెఎస్‌వై స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పధకానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి శాంక్షన్ కమిటీ సమావేశం మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పిఎంకెఎస్‌వై కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తాధ్వర్యంలో  ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, వ్యవసాయ శాఖల ద్వారా చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అజెండా అంశాలను సమావేశంలో ఆమోదించారు. అజెండాకు సంబంధించిన ముఖ్యంగా ఎపిఎంఐపి, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, వ్యవసాయ శాఖల ద్వారా చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన 2018-2019 అంశాల‌పై కార్యాచరణ ప్రణాళికలను ఆమోదించారు. తొలుత గతేడాది వివిధ ప్రాజెక్టుల వారీగా సాధించిన ప్రగతిని సిఎస్ సమీక్షించారు. జాతీయ రహదారులు ఇతర ప్రధాన రహదారుల వెంబడి ఉన్న కొండలు, గుట్టలపై పెద్దఎత్తున పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అటవీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులను ఆదేశించారు. నీటి సంరక్షణ చర్యలను పెద్దఎత్తున చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కొండవాలుల్లో చెక్ డ్యాంలు, కాంటూర్ ట్రెంచ్‌లు, పెర్కులేషన్ ట్యాంకులు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పిఎంకెఎస్‌వై పధకం అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై సిఎస్ దినేష్‌కుమార్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయశాఖ ప్రత్యేక కమీషనర్ డి.మురళీధర్ రెడ్డి, కాడా ప్రత్యేక కమీషనర్ డాక్ట‌ర్ పిఎస్ రాఘవయ్య ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...