Published On: Sun, May 20th, 2018

జీవితంలో ఒడుదుడుకులకు ఈ శ్లోకం ఆచరణాత్మక పరిష్కారం

(సెల్ఐటి న్యూస్‌, ఆధ్యాత్మికం) ..

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।

సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।। 

భావము: కర్మఫలములందు మమకారమును, ఆసక్తిని విడచి  కర్తవ్య నిర్వహణ లో స్థిరచిత్తుడవై యుండుము.    జయాపజయముల పట్ల సమ దృష్టి కలిగియుండుటయే యోగము అని చెప్పబడుతుంది. అర్జునుడు యోగంలో (స్థిరముగా) ఉండి తన విధ్యుక్త ధర్మాన్ని  ఆచరించాలని శ్రీకృష్ణుని బోధ. ఇంతకూ యోగం అంటే ఏమిటి?
శ్రీ కృష్ణుల వారు “యోగము” అనే అత్యుత్తమ పదమును వివరిస్తున్నారు. “అన్ని పరిస్థితులలోను ప్రశాంత చిత్తంతో ఉండటం, సుఖదుఃఖములు, గెలుపు ఓటములను సమదృష్టితో స్వీకరించటం అని తెలియజేస్తున్నారు”. ఈ సమత్వ బుద్ది అంత తేలికగా అబ్బదు, మన చేయవలసిన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. అదే విధంగా ఫలితములు కూడా భగవంతుని ప్రీతి కొరకే, ఆయనకే సమర్పిస్తున్నాము అని భావించినప్పుడు, అనుకున్నవిధముగా జరగకపోయినా,  భగవంతుని సంకల్పముగా ప్రశాంతముగా స్వీకరిస్తాము. ఈ విధంగా ఫలితముపై నాకు ఆసక్తి లేదు, కేవలము భగవానుని ప్రసాదముగా స్వీకరించినప్పుడు మాత్రమే సమత్వ బుద్ధిని పెంపొందించుకుంటాము. జీవితంలోని ఒడుదుడుకులకు ఈ శ్లోకం ఒక ఆచరణాత్మక పరిష్కారం చూపుతుంది. నావ లో సముద్ర ప్రయాణం  చేస్తున్నప్పుడు  అలలు  తాకినప్పుడల్లా  కలత చెంది, ఆందోళన చెందుతాము, కానీ అలలే  రావద్దు అని కోరుకోలేము. అదే విధంగా, సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు, మనము నియంత్రించలేని ఎన్నో అలలు మనలను కలవర పరుస్తాయి. ప్రతికూల పరిస్థితులని నివారించటానికి పోరాడే కంటే,  శక్తి మేర ప్రయత్నం ఆపకుండా, దారిలో వచ్చే ప్రతి ఫలితాన్నీ స్వీకరించటం నేర్చుకుంటే, ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే. చంచలమై ఉన్న ఇంద్రియాలను నిగ్రహించుకొని భగవంతుని మీదనే ధ్యానాన్ని ఉంచడం యోగం. అదే నిజమైన యోగము.

Just In...