Published On: Wed, Jun 13th, 2018

మాతా శిశుమరణాల రేటును 0 శాతానికి తగ్గించాలి

* కేరళను మించి నెంబర్-1 ర్యాంకు రావాలి

* ఉద్యోగులపై పనిభారం సమస్యే లేదు

* నాలుగేళ్ల కష్టానికి గుర్తింపుగా వేతనాలు పెంచాం

* వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: మాతా శిశుమరణాల రేటులో (ఎ.ఎం.ఆర్, ఐఎం.ఆర్) దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను నాలుగేళ్లలో 4వ ర్యాంకుకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేరళను అధిగమించి నెంబర్-1 స్థానం చేరుకోవాలని, ‘0’ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం కోరారు. ఉద్యోగులందరూ తనతో పాటు కష్టపడటంతో నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురాగలిగినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గ‌డ‌చిన నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో, మేలిమి పద్ధతులతో విద్యారంగంలో నెంబర్-1 స్థానం కైవసం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఎ.ఎన్.ఎంలు, కాంట్రాక్టు కార్మికులు, పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు పెంచినందుకు, పి.ఆర్.సి ఎరియర్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్ర‌బాబును ఉద్యోగులు మంగళవారం సాయంత్రం సచివాలయంలో సత్కరించారు. తాను రాత్రి నిద్రించే సమయంలో తప్ప రోజంతా కష్టపడతానని, పని చేయటంలో ఆనందం పొందుతానని చెప్పారు. పనిని భారంగా కాకుండా బాధ్యతగా చేయాలని, కష్టపడినా ఇష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రజల ఆరోగ్య భద్రత, మాతా శిశుమరణాల రేటు తగ్గించే బాధ్యతను ఏఎన్ఎంలు, ఉద్యోగులు, కార్మికులు చూసుకోవాలని కోరారు. ‘ఈ నాలుగేళ్లుగా మీరెంతో కష్టపడి పనిచేశారు. మీ సేవలకు గుర్తింపుగానే రాష్ట్రంలో 13,000 మంది కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందికి వేతనాలు పెంచాం. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ సేవలను పరిగణనలోకి తీసుకుని, ప్రోత్సాహకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. గర్భిణుల సుఖప్రసవానికి, తల్లీ, బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరడానికి ఎ.ఎన్.ఎం లు సహకరించాలని చంద్రబాబు కోరారు. నాలుగేళ్ల తన పరిపాలనలో టెక్నాలజీని ఉపయోగించుకుని ఉద్యోగుల మీద పనిభారం లేకుండా చేశామని, ఉద్యోగులు ఆనందంగా గడపడానికి హ్యాపీ సండే నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భిణులు ప్రసూతి సమయంలో సెలవులో ఉన్న రెండు నెలలకు పూర్తి వేతనాన్ని చెల్లిస్తున్నామని వివరించారు. దేశంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా నిలిచిపోవాలి. మీరంతా మనసు పెట్టి పనిచేయండి. మీ బాధ్యత నేను చూసుకుంటాను. మీరు ప్రజలు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయండి. మీరు కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధిని కొనసాగించేందుకు ప్రభుత్వానికి మళ్లీ ప్రజల ఆశీర్వాదం అందజేస్తారు. మీ బాగోగులు, సంక్షేమాన్ని మన ప్రభుత్వం చూసుకుంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ ఎ.ఎన్.ఎంలు, ఇతర విభాగాల ఉద్యోగులను కోరారు.
                      మహిళలు నాయకత్వ లక్షణాలతో ఎదగాలన్నది తమ విధానమని, ఉద్యోగులు తమను నమ్ముకున్న  కుటుంబ సభ్యులను మంచిగా చూసుకోవాలని, అదే సమయంలో  ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలను శ్రద్ధగా చూడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నాలుగేళ్ల నాడు ఏమీ లేని స్థితి నుంచి కష్టపడి సంపద సృష్టించామని, సంపద సృష్టి లేకుంటే వెనుకబడి పోతామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకుండా చూశామని, పెన్షన్లు, జీతాలు ఒకటో తేదీకే చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1గా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నమని, అందరి కష్టంతోనే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తోందని అన్నారు.  ప్రజలు శహభాష్ అనే విధంగా పనిచేయాలని ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పరిపాలన మీద, సంక్షేమ పథకాల అమలుపై అత్యధిక సంతృప్తి శాతం తీసుకురావాలని తాము చెప్పేది ఇందుకేనన్నారు. ఉద్యోగులకు పనిభారంగా అన్పిస్తే సాధికారమిత్రల సహాయం తీసుకోవాలని, పనిలో వారి భాగస్వామ్యం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మీకు పనిభారం అన్పిస్తే సాధికారమిత్రల సహాయం తీసుకోవాలని, పనిలో వారి భాగస్వామ్యంతో పనిభారం తగ్గించుకోవచ్చని సీఎం సూచించారు.  24 గంటలూ చదివిస్తే మంచి ఫలితాలు వస్తాయనే కార్పొరేట్ కళాశాలల ఆలోచనా ధోరణిని తాను తప్పుబట్టానని, మందలించానని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నది తమ అభిప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించడం వల్ల విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చని చెప్పారు. వేగంగా ఫలితాలు వచ్చాయని, మ్యాథ్స్ లో దేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు ఉన్నత స్థానం సాధించారని అన్నారు. గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని  సీఎం కోరారు. స్వచ్ఛమైన వాతావరణం సృష్టించడంలో భాగంగా రాష్ట్రంలో టెక్నాలజీ సాయంతో గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. అరవై ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా సమైక్యాంధ్రప్రదేశ్ లో ఉండి, నాలుగేళ్లనాడు రాజధానిని వదులుకుని కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని, అయితే కేవలం కేంద్రం ఇచ్చే సహాయం కోసమే ఎదురు చూడకుండా ఉద్యోగుల సహకారంతో కష్టపడి  రెండంకెల వృద్ధిరేటు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. తమకు వేతనాలు పెంచినందుకు ఎ.ఎన్.ఎంలు, కాంట్రాక్టు కార్మికులు, పొరుగుసేవల సిబ్బంది ముఖ్య‌మంత్రికి కృతజ్ఞతలు చెబుతూ కేకును క‌త్తిరించారు. పి.ఆర్.సి వేతం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పొరుగు సేవలు, కాంట్రాక్టు  ఉద్యోగులలో గర్భిణులకు,బాలింతలకు పూర్తి జీతంతో 2 నెలల ప్రసూతి సెలవు మంజూరు చేసినందుకు, ముఖ్యమంత్రిని సత్కరించారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను శాశ్వత పద్ధతిలో నియమించాలని, వయో భారంతో అందరూ సైకిళ్లు నడపలేరని, స్కూటీలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఎంపీహెచ్ఎ పోస్టులు భర్తీ చేయాలని, ఎ.ఎన్.ఎం.లకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని వర్తింపజేయాలని, విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి ఉపాధి దారి చూపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం  అధ్యక్షురాలు రేణుకాదేవి, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో తొమ్మిది జిల్లాల నుంచి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి ఉద్యోగులు, ఎ.ఎన్.ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులు 100 మంది ముఖ్యమంత్రిని కలిశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్., వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య పాల్గొన్నారు.

Just In...