Published On: Thu, Jun 14th, 2018

ఉక్కు ఫ్యాక్టరీ కోసం మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి

* ఏపిసిసి ముఖ్య అధికార ప్ర‌తినిధి కొల‌నుకొండ శివాజీ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల మోడీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఏపిసిసి ముఖ్య అధికార ప్ర‌తినిధి కొల‌నుకొండ శివాజీ అన్నారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టం అమలు చేయకుండా నాటకాలడుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. పార్లమెంటు ఆమోదించిన విభజనచట్టంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నార‌ని తెలిపారు. మోదీ సర్కారు కావాలనే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కాలయాపన చేస్తుంద‌న్నారు. కడప జిల్లాలో ముడి ఖనిజం నాణ్యత సరిగా లేదని, అనువైన పరిస్థితులు లేవంటూ కుంటి సాకులు వెతుకుతుంద‌న్నారు. తన రాజకీయ కుట్రలకు ఐదు కోట్లమంది ఆంధ్రులను బలి చేస్తుంద‌ని పేర్కొన్నారు. చివర‌కు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు అధికారికంగా తెలియపర్చినా కొంత‌మంది నాయకులు అంత చేశాం.. ఇంత చేశాం.. అంటూ మీడియాలో అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదంగా వుంద‌న్నారు. నాడు రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌ పార్టీని వీడిన కొంతమంది నాయకులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ పంచన చేరారు? అని ప్ర‌శ్నించారు. అలాగే ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డికి తన సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సంకల్పం లేకపోవడం విడ్డూరంగా ఉంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దీనిపై మోడీని ఎందుకు నిలదీయరు? వీరందరికీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధి వుంటే కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి. ఇందుకోసం కలసి పోరాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ దిశగా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. నాలుగేళ్ల పాటు చోద్యం చూసిన చంద్రబాబు ఇకనైనా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందించాలి. కేవలం ధర్మపోరాటం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తూ.. రాష్ట్రంలో దీక్షలు చేసినంత మాత్రాన కేంద్రం దిగిరాదన్న సంగతి గుర్తెరగాల‌న్నారు.

Just In...