Published On: Mon, Jun 25th, 2018

‘దళిత తేజం-తెలుగు దేశం’ సభకు తరలిరండి

* మంత్రి దేవినేని ఉమా పిలుపు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఈ నెల 30న నెల్లూరులోని వేణుగోపాలస్వామి స్టేడియంలో జరగనున్న దళితతేజం-తెలుగుదేశం భారీ బహిరంగ సభలో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. తెదేపా జిల్లా కార్యాలయంలో ఆదివారం తెదేపా ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వాసం మునియ్య అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి దేవినేని మాట్లాడుతూ దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా దళితుల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఎస్సీల సంక్షేమానికి రూ.12వేల కోట్లు కేటాయించింది తెదేపా మాత్రమేనన్నారు. రాష్ట్ర పరిశీలకులు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ దళితతేజం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, బహిరంగసభలో దళితులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ జిల్లాలోని 16 నియోజకవర్గాల్లోని దళితవాడల్లో నాయకులు పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ గోడపత్రికను, సీడీలను ఆవిష్కరించి రాష్ట్ర పార్టీ పరిశీలకులను సన్మానించారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, తంగిరాల సౌమ్య, కాగిత వెంకట్రావు, తిరువూరు ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్‌, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, కొత్త నాగబాబు, చింతపల్లి వెంకటేశ్వరరావు, జీవీ నరసింహారావు, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యవర్గ సభ్యులు, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...