Published On: Sat, Jul 14th, 2018

దాత‌ల‌కు అన్ని విధాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాం

* తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యుడు, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు

* తితిదే నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ఉచితంగా 10 ట‌న్నుల కూర‌లు పంపిణీ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: తిరుమ‌ల శ్రీవారికి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు వారి ఆక‌లిని తీరుస్తూ ఉచిత నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి వివిధ రూపాల్లో విరాళాలు స‌మ‌ర్పించే దాత‌ల‌కు తితిదే త‌ర‌ఫున అన్ని విధాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యులు, విజ‌య‌వాడ మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. సామాజిక కార్య‌క‌ర్త‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మండ‌వ కుటుంబ‌రావు ఆధ్వ‌ర్యంలో తితిదే ఉచిత నిత్యాన్న‌దాన ప‌థకానికి శుక్ర‌వారం 10 ట‌న్నుల కూర‌గాయ‌లను విజ‌య‌వాడ నుంచి ఉచితంగా విత‌ర‌ణ చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్బీపేట‌లోని ఏ1 క‌న్వెన్ష‌న్ ప్రాంగ‌ణంలో కూర‌గాయ‌ల వాహ‌నాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అనంత‌రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 2007 బ్ర‌హ్మోత్స‌వాల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో శ్రమకోర్చి తితిదే నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ఉచితంగా ట‌న్నుల కొల‌ది కూర‌గాయ‌లు పంపించ‌డం సాధార‌ణ విష‌యం కాద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మండ‌వ కుటుంబ‌రావు ఆధ్వ‌ర్యంలో శ్రీవారికి 300 ట‌న్నుల కూర‌ల‌ను పంపించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు విచ్చేసే భ‌క్త‌కోటి ఆక‌లిని తీర్చేందుకు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పైసా కూడా ఖ‌ర్చు పెట్ట‌కుండా కేవ‌లం దాత‌లు అందించే విరాళంతోనే భ‌క్తుల‌కు భోజ‌నాలు పెడుతున్న‌ట్లు తెలిపారు. ఒక రోజు భోజ‌నాలు పెడితే రూ.25 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిపారు. ఇక‌పై నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి విరాళాలు అందించే భ‌క్తుల‌కు తితిదే త‌ర‌ఫున అందించే స‌హాయ‌స‌హ‌కారాల‌పై త్వ‌ర‌లోనే తితిదే బోర్డు స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా దాత మండవ కుటుంబ‌రావును అభినందించారు. దాత మండ‌వ కుటుంబ‌రావు మాట్లాడుతూ త‌న‌తో పాటు త‌న బంధువుల స‌హాకారం వ‌ల్లే గ‌డ‌చిన ప‌న్నెండేళ్లుగా తితిదే నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి కూర‌గాయ‌లు విత‌ర‌ణ చేయ‌డం సాధ్య‌మౌతుంద‌న్నారు. త్వ‌ర‌లో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్న నేప‌ధ్యంలో మ‌రిన్ని కూర‌గాయ‌లను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో మండ‌వ కాశీఅన్న‌పూర్ణ‌, మండ‌వ వెంక‌ట‌ర‌త్నం, మండ‌వ శ్రీనివాస‌రావు, మండ‌వ స‌స్య‌, బి.ఎ.నాగు, ధ‌నేకుల స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...