Published On: Mon, Nov 5th, 2018

చట్టబద్ధ వ్యాపారం చేస్తే, సిబిఐ, ఈడి కేసులెందుకు పెట్టిందో..

* సంక్రాంతి పండుగ తర్వాత వీరు కనిపించరు

* పట్టిసీమ చింతలపూడి తో మైలవరం సస్యశ్యామలం చేశాం

* కొండపల్లిలో 1600ల పట్టాలు పంపిణీ చేశాం

* ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఇచ్చేందుకు రూ.186.90 కోట్లు మంజూరు చేసాం

* పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త ఎల్లవేళలా గుర్తుంటారు

* కొండపల్లిలో తెదేపా కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి దేవినేని ఉమా 

సెల్ఐటి న్యూస్‌, ఇబ్రహీంపట్నం (కొండపల్లి): చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే సిబిఐ ఈడీ కేసులు ఎందుకు పెట్టిందో అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైకాపా నాయకుల ను ప్రశ్నించారు. సిబిఐ ఈడీ కేసుల్లో ఎ7 ముద్దాయిగా ఉంటూ నీతి సూత్రాలు చెబితే ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. సోమవారం నాడు కొండపల్లిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని వందలాది మంది కార్యకర్తల సమక్షంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత నియోజకవర్గంలోని వైకాపా నాయకుడు కనిపించడని జోస్యం చెప్పారు. పట్టిసీమ చింతలపూడి పథకాలతో మైలవరం నియోజకవర్గ పంట పొలాలను సస్యశ్యామలం చేసినట్లు చెప్పారు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా రైతులుకు ఇబ్బందులు తప్పేవి కావని పేర్కొన్నారు. అలాంటి రైతుకు అన్నం పెట్టిన మెతుకుసీమ పట్టిసీమను వ్యతిరేకించడం రైతుబిడ్డ లక్షణం కాదన్నారు. కొండపల్లి లో పదహారు వందల మంది అర్హులైన నిరుపేదలకు పసుపు కుంకుమ చీర సారెతో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇంటికి ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఇచ్చేందుకు ఇంటింటికి కుళాయి పథకానికి రూ.186.90 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. పార్టీకోసం కష్టపడే ప్రతి కార్యకర్త ఎల్లవేళల తనకు గుర్తుంటారు అని వారిని మరిచిపోబోనని చెప్పారు. ప్రజలకు దూరమైన కార్యకర్త నాకు దూరమైనట్లేనని కష్టపడితేనే ప్రజల్లోనూ పార్టీలోనూ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు రోజుకు 18 గంటలు కష్టపడుతున్న విషయాన్ని కార్యకర్తలందరికీ మంత్రి ఉమా గుర్తు చేశారు. అనంతరం కోటి 40 6 లక్షలతో నిర్మించనున్న ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముందు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుండి కొండపల్లి వరకు బైకులతో, ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు.  దారిపొడవునా పూలవర్షం కురిపిస్తారు కార్యకర్తలు మంత్రి ఉమా కు ఘనస్వాగతం పలికారు.

Just In...