Published On: Mon, Nov 5th, 2018

న‌లంద డిగ్రీ క‌ళాశాలలో “ఎకో ఫ్రెండ్లీ దీపావళి”

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నలంద డిగ్రీ కళాశాలలో “ఎకో ఫ్రెండ్లీ దీపావళిని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ స్కూల్ విద్యార్థులకు ఎకో ఫ్రెండ్లీ దీపావళి కాన్సెప్ట్ మీద డ్రాయింగ్, వ్యాసరచన, డెకరేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు దీపపు ప్రమిదలను అందంగా అలంకరించారు. వాటిని విక్ర‌యించ‌గా వచ్చిన సొమ్మును తిత్లీ తుఫాను బాధితులకు విరాళంగా అందజేస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ యం.అనూరాధ తెలిపారు. పర్యావరణ హితంగా దీపావళిని జరుపుకోవాలని విద్యార్థులకు తెలియజెప్పేలా పోటీలు నిర్వహించామని హ్యాపీ సండేలో ఈ కాన్సెప్టెను తెలియ‌జేస్తూ కార్యక్రమం రూపొందించామ‌న్నారు. విద్యార్థులు సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌ల‌ను తీశారని పేర్కొన్నారు. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తితిదే విజ‌య‌వాడ జోన్ సూప‌ర్నెంట్ ఎస్.శోభారాణి పాల్గొని పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. రెడ్.ఎఫ్.ఎమ్ ఆర్.జె. మిస్టర్ ఫెర్ఫెక్ట్ సుధాకర్, మరియు ఆశ్విత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగలు జరుపుకోవటం మన సంప్రదామ‌ని, పర్యావరణాన్ని రక్షించటం మన ప్రధమ కర్తవ్యం అంటూ ప్రతి సంవత్సరం వినాయక చవితి, దీపావళి సందర్భంగా వివిధ కార్యక్రమాలలో విద్యార్థులను భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా అవగాహనా క‌ల్పిస్తున్నామ‌ని క‌ళాశాల ప్రిన్సిపాల్ అనూరాధ తెలిపారు. కష్టంలో ఉన్నవారికి సాయం అందించడంలోనే నిజ‌మైన ఆనందం ఉంద‌ని పేర్కొంటూ చదువుతో పాటు సామాజసేవ, సామాజిక బాధ్యత, విద్యార్థుల్లో పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని మేనేజిమెంట్ హెచ్‌ఓడి వై.శ్రీలక్ష్మి పర్యవేక్షిచారు.
 

Just In...