Published On: Tue, Nov 6th, 2018

తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు

సెల్ఐటి న్యూస్‌, శబరిమల: ‘శ్రీ చిత్తిర తిరునాళ్‌’ ఉత్సవం సందర్భంగా సోమవారం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ ద్వారాలు తెరిచారు. మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు దేవుడ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో సన్నిధానం కిక్కిరిసిపోయింది. దాదాపు 2300 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. వారిలో 100 మంది మహిళా పోలీసులు ఉన్నారు. రేపు రాత్రి పది గంటల వరకు ఆలయ ద్వారాలు తెరుచుకోని ఉంటాయి. ఎక్కడికక్కడ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు శబరిమలకు వచ్చే భక్తుల్లో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు లేరని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో మొబైల్‌ జామర్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి మీడియా ప్రతినిధులను పంబ, నీలక్కల్‌, సన్నిధానం ప్రాంతాల వద్దే నిలిపివేశారు. వాళ్లను ఆలయం వద్దకు అనుమతించలేదని డీజీపీ లోక్‌నాథ్‌ బెహర తెలిపారు. శబరిమల, పరిసర ప్రాంతాల్లో భద్రతా పరమైన చర్యలు పూర్తయిన తర్వాతే మీడియాను అనుమతిస్తామని వెల్లడించారు. సన్నిధానంలో 50ఏళ్లలోపు పైబడిన 15 మంది మహిళా పోలీసులు విధుల్లో ఉన్నారు. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా మహిళా పోలీసులు సన్నిధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి పూజా కార్యక్రమాలు ముగిసేంత వరకు శబరిమలకు సమీపంలోని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కొనసాగనుంది.

Just In...