Published On: Thu, Nov 8th, 2018

తిరుమలలో లడ్డూల కుంభకోణం

* పొరుగ‌సేవ‌ల సిబ్బంది దందా

* రెండు రోజుల్లో 26 వేల లడ్డూ ప్రసాదం పక్కదారి ప‌ట్టిన వైనం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రం తిరుమల, తిరుపతి దేవస్థానం చరిత్రలో లడ్డూ ప్రసాదం విషయంలో తొలిసారి భారీ కుంభకోణం వెలుగుచూసింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 26 వేల లడ్డూలను పొరుగుసేవల సిబ్బంది స్వాహా చేశారు. ఒక్కో లడ్డూ విలువ రూ.50. ఈ లెక్కన రూ.13 లక్షల మేర శ్రీవారి ఖజానాకు నష్టం వాటిల్లింది. తితిదే విజిలెన్స్‌ విభాగం వెంటనే ఈ అక్రమాన్ని గుర్తించి విచారించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన సమయంలో గరుడ సేవ జరిగిన అక్టోబరు 14వ తేదీ, అంతకుముందు రోజు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి లడ్డూ ప్రసాద టోకెన్ల పరిశీలనకు అంతరాయం ఏర్పడింది. భక్తులకు అసౌకర్యం కలగరాదనే భావనతో టోకెన్లు స్కానింగ్‌ చేయాల్సిన అవసరం లేదంటూ దేవస్థానం ఉన్నతాధికారులు వెసులుబాటు కల్పించారు. ఇదే అదనుగా 30 మంది పొరుగుసేవల సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమాలకు తెరదీశారు. ఒకే టోకెన్‌పై ఒకటికంటే ఎక్కువ సార్లు లడ్డూలు అందిస్తూ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. టోకెన్ల సంఖ్యకు, పంపిణీ చేసిన లడ్డూల సంఖ్యకు పొంతన లేదని గమనించి తితిదే ఇన్‌ఛార్జి సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. వివిధ బ్యాంకుల ద్వారా నియమితులైన పొరుగుసేవల సిబ్బంది, పర్యవేక్షకులు కుమ్మక్కై స్వాహాకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నివేదికను తితిదే విజిలెన్స్‌ అధికారులు తమ ఉన్నతాధికారులకు సోమవారం సమర్పించారు. వారి ఆదేశాలతో బాధ్యులపై తిరుపతి ఒకటో పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. తితిదే విజిలెన్స్‌ విచారణలో పొరుగుసేవల సిబ్బందితో పాటు దేవస్థానం ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ‌రోవైపున తితిదేలో వెలుగుచూసిన ల‌డ్డూల కుంభ‌కోణంపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆల‌య ప్ర‌తిష్ట‌ను కాపాడాలని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

Just In...