Published On: Sat, Nov 10th, 2018

భరత్ భూషణ్ జాతికి అభరణం లాంటివాడు

* ‘నేనింతే’ పుస్తకావిష్కరణ స‌భ‌లో వ‌క్త‌లు
సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఇండియన్ రైల్వేస్ సర్వీస్ రిటైర్ట్ అధికారి భరత్ భూషణ్ లాంటి వారి అవసరం సమాజానికి ఎంతో ఉందని ఆయన బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను పలువురు ప్రముఖులు (వక్తలు) కొనియాడారు. శనివారం ఉద‌యం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రైల్వేస్ పూర్వ అధికారి అపికట్ల భరత్ భూషణ్ ఆటో బయోపిక్ ‘నేనింతే’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు పి.రాములు మాట్లాడుతూ విద్య ద్వారానే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానం విద్య ద్వారానే సాధ్యమౌతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ సమస్యలపై తాను తెలిసిన వెంటనే స్పందిస్తానని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. విశాఖపట్నంతో పాటు తెలుగు రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాలలో ఎస్సీల సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. మనం ఏ పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదని సమస్యలపై స్పందించే వైఖరిని బట్టే మన నాయకత్వం ఆధారపడి ఉంటుందన్నారు. భరత్ భూషణ్ లాంటి వ్యక్తి మన సమాజానికి ఎంతో అవసరమని, వారి తల్లిదండ్రులు ఆరోజుల్లోనే దేశభక్తితో వారి పిల్లలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టారని ఇది ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు మాట్లాడుతూ ఏ సమాజం నుంచి మనం వచ్చామో ఆ సమాజానికి మనం ఏమి చేశామనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. భరత్ భూషణ్‌లాగా పేదలకు సేవలు అందించే అధికారులు అరుదుగా ఉంటారని ఆయన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. చేసిన ఉపకారానికి ఏమి ఆశించని వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఐఎఎస్ అధికారులకు ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయని అలాంటిది రైల్వే అధికారికి ఎంతో మంది సామాన్య ప్రజానీకంతో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇల్లు ఒపెన్ హౌస్ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తికి గ్రీన్ కార్డు ఇచ్చి సత్కారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.
మనిషి నుండి మహానీయుడిగా మారిన భరత్ భూషణ్- బి.రామాంజనేయులు
సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు మాట్లాడుతూ దళిత జాతిలో అణిముత్వం, మహోన్నత వ్యక్తి, సార్ధక నామదేయుడు భరత్ భూషణ్ మన జాతికి అభరణ లాంటి వాడని అన్నారు. మనం చేసే పనుల వల్లే మనకి గుర్తింపు వస్తుందని అలాంటి వారే చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా నిలిచిపోతారన్నారు. భరత్ భూషణ్ మనిషి నుంచి మహానీయునిగా మారాడరన్నారు. ఆయన చేసిన మంచి పనులే సమాజంలో ఆయనకు గుర్తింపును తెచ్చాయన్నారు. సమాజానికి ఇలాంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంతో మందికి సమస్యల పరిష్కారంలో అపన్నహస్తం అందిస్తూ చేయూతను ఇస్తున్నారన్నారు. ఆయనకు ఇంకా మంచి శక్తి యుక్తులు ఇవ్వాలని అభిలాషిస్తున్నానన్నారు. ఇప్పటికే ఆయన చేస్తున్న పనులతో ఒక శక్తిగా మారాడని, మున్ముందు ఒక మహాశక్తిగా రూపొందాలని ఆశిస్తున్నానన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూన్నారని వాటిని ఇంకా కొనసాగించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీలలో అణువణువున ఉన్న భయం పోవాలి-డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ సోసైటీ కార్యదర్శి డాక్ట‌ర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేద బలహీన వర్గాలలో అణువణువు జీర్ణించుకుపోయిన భయం నిర్మూలన కావాలని ఆయన ఆకాంక్షించారు. భరత్ భూషణ్ ఎంతో మంది పేద, బలహీన వర్గాల పిల్లలు ఐఎఎస్, ఐపిఎస్లు, ఉన్నత విద్యావంతులుగా ఎదగడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. భరత్ భూషణ్ ఒక వ్యక్తి కాదని ఆయన ఒక వ్యవస్థ అని అన్నారు. చేసిన పనికి ఏనాడూ కృతజ్ఞత ఆశీంచలేదు-భరత్ భూషణ్…
పుస్తక రచయిత అప్పికట్ల భరత్ భూషణ్ మాట్లాడుతూ నేనింతే పుస్తకాన్ని ముందుగా ఇంగ్లీష్లో రాశానని, ఆ తరువాత దాని తెలుగులో రాయడం జరిగిందని అన్నారు. తన జీవితంలో ఎంతో మందికి కులాలకు అతీతంగా సహాయం అందించానని వారిలో చాలా మంది తిరిగి తనకు కృతజ్ఞతలు కూడా తెలియజేయలేదని అయినప్పటికి నిస్వార్ధంతో మరలా పనులు కోసం వచ్చినా, సహాయం కోసం వచ్చినా చేశానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వారి ప్రయోజనాలకే వినియోగించాలని ఉద్యమం చేశానన్నారు. ఒక గ్రామంలో దళితులకు 60 ఎకరాల భూమిని వారికి కేటాయించేందుకు కృషి చేశానని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బహుజన కెరటాలు పత్రిక ఎడిటర్ దుర్గం సుబ్బారావు, పేబ్యాక్ టూదా సోసైటీ అధ్యక్షులు వై.శివకుమార్, ఒఎన్జిసి ఎసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, సోషల్ యాక్టివిస్ట్ పద్మశ్రీ సునీతా కృష్ణన్, ఏపీజేఎఫ్ నాయ‌కులు చెవుల కృష్ణాంజనేయులు త‌దిత‌రులు భరత్ భూషణ్ సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు. పలువురు వక్తలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరారు.

Just In...