Published On: Wed, Nov 14th, 2018

తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు

 సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు బుధవారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్‌, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ అర్చకులు పుష్పాలను స్వీకరించారు. పుష్పాల ఊరేగింపులో శ్రీవారి సేవకులు, ఉద్యానవన విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని, 1980, నవంబరు 14వ తేదీన పునరుద్ధరించి, అటుతరువాత ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా పుష్పార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు.

Just In...