Published On: Fri, Nov 30th, 2018

ఈ నెల 3న అను హాస్పిటల్‌లో ఉచిత వైద్యశిబిరం

* దివ్యాంగులైన చిన్నపిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల మూడో తేదీన అను హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు తెలిపారు. సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో శుక్ర‌వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుట్టుకతో అంగవైకల్యం, కాళ్లు, చేతులు వంకరపోవడం, సెలిబ్రిల్ పాల్సీతో నడవలేని పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తామని, అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. దొడ్డికాళ్లు, వంకరకాళ్లు, వంకర చేతులు, కాళ్ల హెచ్చుతగ్గులు, భుజంగూడు పక్కకి తొలగిపోవడం, పుట్టుకతో అంగవైకల్యం, ఇన్ఫెక్షన్ కారణంగా ఎముకలు క్షీణించడం, ప్రమాదాల్లో కాళ్లు, చేతులు వంకరపోవడం, బుద్ధిమాంద్యం కారణంగా నడవలేకపోవడం(సెలిబ్రిల్ పాల్సీ) తదితర శారీరక అంగవైకల్య సమస్యలకు ఈ శిబిరంలో చికిత్స చేస్తామన్నారు. సరైన సమయంలో నాణ్యమైన చికిత్స అందించడం ద్వారా చిన్నపిల్లల్లోని అంగవైకల్యాన్ని శాశ్వతంగా నయం చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా మెదడు కణజాలం దెబ్బతినడం కారణంగా సంభవించే సెలిబ్రిల్ పాల్సీ రుగ్మతకు ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్, ఆపరేషన్ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. చిన్నపిల్లల్లోని అంగవైకల్యాన్ని సరిచేసి, వారు సాధారణ జీవనం గడిపేలా చేసేందుకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అను హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ దుర్గానాగరాజు వివరించారు. ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి.రమేష్, ఫిజియోథెరపిస్టు రమ్య పాల్గొన్నారు.

Just In...