Published On: Tue, Dec 4th, 2018

వైకుంఠ ఏకాద‌శికి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు

* జెఈవో కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: ఈ నెల 18న వైకుంఠ ఏకాద‌శి, 19న ద్వాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గకుండా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆల‌య మాడ వీధులు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను మంగ‌ళ‌వారం టిటిడి సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టితో క‌లిసి జెఈవో త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సూచ‌న‌ల మేర‌కు మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు వీలుగా చ‌లికి ఇబ్బందులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇక్క‌డ తాగునీరు, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని తెలిపారు. భ‌క్తుల‌ను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 1లోకి అనుమ‌తిస్తామ‌ని, అవి నిండిన త‌రువాత వ‌రుస‌గా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, ఆళ్వార్‌ట్యాంక్ లైన్‌, మాడ వీధుల్లోని షెడ్లు, బాట‌గంగ‌మ్మ గుడి మీదుగా క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద భ‌క్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ఈ విధంగా మొత్తం 80 వేల మంది భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఏకాద‌శి, ద్వాద‌శి రెండు రోజుల్లో ఒక ల‌క్షా 70 వేల మంది భ‌క్తులు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక‌రోజు ముందుగా భ‌క్తులు రావ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, చ‌లికాలం కావ‌డం, వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు ఉండ‌డంతో ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్ర ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోరారు. డిసెంబ‌రు 18న ఉద‌యం 5.30 గంట‌ల నుండి సామాన్య భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు. జెఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ర్టిక‌ల్స్‌) వేంక‌టేశ్వ‌ర్లు, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ‌ర్మిష్ట‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి వేణుగోపాల్ త‌దిత‌రులు ఉన్నారు.
   

Just In...