Published On: Mon, Jan 7th, 2019

ఈ నెల 20 నుండి పున్న‌మీఘాట్‌లో శ్రీవారి నిత్యోత్స‌వాలు

* సుప్ర‌భాత సేవ మొద‌లు ఏకాంత సేవ వ‌ర‌కు తిరుమ‌ల త‌ర‌హాలో ప్ర‌త్యేక పూజాధికాలు నిర్వ‌హ‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కులు, రాష్ట్ర ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాలు, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్షిస్తూ శ్రీ ల‌క్ష్మీ శ్రీనివాసా వాస‌వి సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఈ నెల 20వ‌ తేదీ నుండి 27వ తేదీ వ‌ర‌కు కృష్ణా తీరంలోని పున్న‌మీఘాట్‌లో స‌ర్వ‌కార్య సిద్ది మ‌హాశాతి హోమ స‌హిత శ్రీవారి నిత్యోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు శ్రీ ల‌క్ష్మీ శ్రీనివాసా వాస‌వి సేవా స‌మితి అధ్య‌క్షులు దూపుగుంట్ల శ్రీనివాస‌రావు, క‌మిటీ స‌భ్యులు గరిమెళ్ళ నానయ్య చౌదరి (నాని) తెలిపారు. ఆదివారం ఉద‌యం పున్న‌మీఘాట్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారిరువురూ మాట్లాడుతూ శ్రీ ల‌క్ష్మీ శ్రీనివాసా వాస‌వి సేవా స‌మితి 13వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఏడాది శ్రీవారి నిత్యోత్స‌వాల‌ను ప‌విత్ర కృష్ణాతీరంలోని పున్న‌మీఘాట్‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. గ‌తంలో శ్రీవారి నిత్యోత్స‌వాల‌ను న‌గ‌రంలోని స్వరాజ్య మైదానంలో, ప‌ట‌మ‌ట రైతుబ‌జార్‌లో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించామ‌ని తెలిపారు. నిత్యోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి రోజు సూర్యోద‌యానికి పూర్వం సుప్ర‌భాత సేవ మొద‌లు రాత్రి ఏకాంత సేవ వ‌ర‌కు తిరుమ‌ల‌లో కొలువైన అఖిలాంఢ‌కోటి బ్ర‌హ్మాండ‌నాయకుడైన శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారికి జ‌రిగే త‌ర‌హాలో భ‌క్తుల‌ను భాగ‌ప్వామ్యం చేస్తూ తిరుమ‌ల త‌ర‌హాలో ఇక్క‌డ కూడా అన్ని పూజాధికాలు, ఆర్జిత సేవ‌లు నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా వారోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తిరోజూ 500 జంట‌ల‌ను క‌ల్యాణోత్స‌వంలో ఎటువంటి రుసుము లేకుండా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌త్యేక పూజ‌ల‌నంత‌రం భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదంతో పాటు తీర్థ‌ప్ర‌సాదాలు పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా నిత్యోత్స‌వాల‌కు సంబంధించిన బ్రోచ‌ర్‌ను విడుద‌ల చేశారు. విలేక‌రుల స‌మావేశంలో శ్రీ ల‌క్ష్మీ శ్రీనివాసా వాస‌వి సేవా స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మామిడి ల‌క్ష్మీ వెంక‌ట కృష్ణారావు, గౌర‌వాధ్య‌క్షురాలు మానేప‌ల్లి ల‌క్ష్మీకుమారి, కోశాధికారి ఉద‌య‌గిరి శ్రీనివాసులు, ప‌లువురు క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...