Published On: Tue, Jan 8th, 2019

ఆర్టీజీఎస్ ప‌నితీరు అద్భుతం

* ప్ర‌పంచంలో ఎక్క‌డా ఇలాంటిది లేదు

* ఇక్క‌డికి రావ‌డం చాలా ఆనందంగా ఉంది

* ఏపీ డిజిట‌ల్ పాల‌న ఆద‌ర్శ‌ప్రాయం

* చాలా ప్ర‌త్యేక‌త‌లు ఇందులో ఉన్నాయి

* రాష్ట్ర ప్ర‌గ‌తికి చంద్ర‌బాబు ప‌డుతున్న కృషి ప్ర‌శంస‌నీయం

* బ్రిట‌న మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ ప్ర‌శంస‌లు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్ ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ ప్ర‌శంస‌లు కురిపించారు. టోనీ బ్లెయిర్ సోమ‌వారం స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)ను సంద‌ర్సించారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న్ను ఆర్టీజీఎస్‌కు సాద‌రంగా తీసుకుని వ‌చ్చారు. ఈ  కేంద్రం ప‌నిచేస్తున్న తీరు గురించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా టోనీ బ్లెయిర్ ఆయ‌న బృందానికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని మాట్లాడుతూ ఆర్టీజీఎస్ రియ‌ల్ టైమ్‌లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌లు ఆకట్టుకున్నాయ‌న్నారు. ప్ర‌కృతి విప‌త్తుల‌ను  ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్న తీరు ముచ్చ‌ట గొలిపింద‌ని తెలిపారు. బిగ్ డాటాను ఉప‌యోగించుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిజిట‌ల్ పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురావాడం ఆనందంగా ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ కొత్త రాష్ట్ర‌ పురోభివృద్ధికి చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌న్నారు. తాను చంద్ర‌బాబు నాయుడు ఆహ్వానం మేర‌కు ఇక్క‌డికి వ‌చ్చాన‌ని, ఈ కేంద్రం సంద‌ర్శించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. కొత్త రాష్ట్రం అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధిస్తున్న విజ‌యాలు అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయమ‌ని  చెప్పారు.  ప్ర‌పంచంలో ఈ త‌ర‌హా వ్య‌వ‌స్థ ఎక్క‌డా కూడా లేద‌ని, త‌న‌ను ఇక్క‌డికి ఆహ్వానించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. నిజంగా నేను త‌న్మ‌య‌త్వం చెందాను ఈ కేంద్రంలో చాలా స్ఫూర్తిదాయ‌కంగా ప‌నిచేస్తోంద‌న్నారు. అంత‌కు మునుపు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టోనీ బ్లెయిర్ గురించి అధికారుల‌కు ప‌రిచ‌యం చేశారు.  ఉమ్మ‌డి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు టోనీ బ్లెయిర్ హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని గుర్తు చేశారు. ఆ సమ‌యంలో ఆయ‌న్ను నేను మీకు హైద‌ర‌బాద్ వెళ్ల‌మ‌ని ఎవ‌రు చెప్పారు, మీకు హైద‌రాబాద్ గురించి ఎలా తెలిసింద‌ని అని అడిగితే ఆయ‌న చెప్పిన స‌మాధానం ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌న్నారు. అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ మీ గురించి హైద‌రాబాద్ గురించి చెబితే చూద్దామ‌ని వ‌చ్చాన‌ని చెప్పార‌ని చంద్ర‌బాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ప్ర‌పంచం ఇప్పుడు ఒక చిన్న ప‌ల్లెటూరుగా మారింద‌ని, మ‌నం ఒక చిన్న మంచి ప‌నిచేసినా ప్ర‌పంచానికి తెలిసిపోతుంద‌న్నారు. బ్లెయిర్ చాలా గొప్ప నేత‌ని, చిన్న వ‌య‌సులోనే బ్రిట‌న్‌కు ప్ర‌ధాని కాగ‌లిగార‌న్నారు. ఇటీవ‌లే ఆయ‌న్ను సింగ‌పూర్‌లో క‌లిసి ఇక్క‌డికి రావాల్సిందిగా ఆహ్వానించాన‌ని చెప్పారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు  ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా టోనీ బ్లెయిర్‌కు ఆర్టీజీ ప‌నితీరు, ప్ర‌భుత్వం రియ‌ల్ టైమ్‌లో అందిస్తున్న సేవ‌లు, ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల గురించి వివ‌రించారు.  ఏడాది క్రితం ప్రారంభించిన ఆర్టీజీఎస్ ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడులా మారింద‌ని, ప‌రిష్కార వేదిక 1100 కాల్ సెంట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వీక‌రించి వాటిని ప‌రిష్క‌రిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,74,60,944 ఫిర్యాదుల‌ను ప్ర‌జ‌ల నుంచి స్వీక‌రించి వాటిని ప‌రిష్క‌రించామ‌ని తెలిపారు.  అవేర్ విభాగం ద్వారా వాతావ‌ర‌ణాన్ని క‌చ్చితంగా అంచ‌నా వేయ‌గ‌లుగుతున్నామ‌న్నారు. దీనివ‌ల్ల తుపాన్ లాంటి విప‌త్తుల స‌మ‌యంలో ఎక్క‌డ తుఫాన్ క‌చ్చితంగా తీరాన్ని తాకుతుందో అంచ‌నా వేస్తున్నామ‌ని దానివ‌ల్ల ఆ ప్రభావిత జిల్లాలో యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసి న‌ష్ట నివార‌ణ త‌గ్గిస్తున్నామ‌న్నారు. ఇటీవ‌లే వ‌చ్చిన పెథాయ్ తుపాన్  రాష్ట్రాన్ని తాకినా క‌నీసం ఒక మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌కుండా కాపాడ‌గ‌లిగామ‌ని, తిత్లీ తుఫాన్ న‌ష్ట తీవ్ర‌త‌ను త‌గ్గించ‌గ‌లిగామ‌ని, ఇలా తుపాన్‌లు, ప్ర‌కృతి విప‌త్తుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నామ‌న్నారు. ప‌రిపాల‌న‌లో టెక్నాల‌జీని ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా వినియోగించుకుంటోంద‌ని, దాని ద్వారా ప్ర‌తి కుటుంబానికి రూ.10వేల ఆదాయం స‌మ‌కూరేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంద‌న్నారు. ప్ర‌జా సాధికార స‌ర్వే ద్వారా రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం వివ‌రాలు తీసుకుని, ఈ డాటా ఆధారంగా ప్ర‌జ‌లకు సంక్షేమ‌ప‌థకాల‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌గ‌లుగుతున్నామ‌ని తెలిపారు.  ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో పాటు, ప్ర‌భుత్వం ప‌నితీరుపైనా ప్ర‌భుత్వం ప్రజ‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తూ, ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నామ‌ని తెలిపారు. భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సంతృప్తి 80శాతం తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని తెలిపారు.  భూగ‌ర్భ జ‌లాలు ఎక్క‌డెక్క‌డ ల‌భిస్తున్నాయో కూడా తాము అంచ‌నా వేసి రైతుల‌కు స‌ల‌హాలు ఇస్తున్నామ‌న్నారు .  రాష్ట్రం మొత్తం 20వేల స‌ర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతిభ‌ద్ర‌త‌ల మొద‌లు, పారిశుద్ధ్యం, ప‌చ్చ‌ద‌నం వ‌ర‌కు రియ‌ల్ టైమ్‌లో ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. పైబ‌ర్ నెట్‌ను ప్ర‌జ‌ల‌కు చౌక ధ‌ర‌కు అందిస్తూ ప్ర‌తి ఇంటికీ  వేగంతో కూడిన అంత‌ర్జాలం అందించ‌డంతో పాటు,  టీవీ, టెలిఫోన్ స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. పైబ‌ర్ గ్రిడ్‌; గ‌్యాస్‌గ్రిడ్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, రోడ్స్ గ్రిడ్‌లాంటివి సాధిస్తూ ప్ర‌భుత్వం ముందుకెళుతోంద‌న్నారు. పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిరునామాగా మారింద‌ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని తెలిపారు. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు.ఏ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేస్తూ ప్ర‌జా సాధికార స‌ర్వే ద్వారా సేక‌రించిన బిగ్ డాటాను ప్ర‌భుత్వం ఎలా స‌ద్వినియోగం చేసుకుంది వివ‌రించారు. 4 కోట్ల మందికి పైగా ప్ర‌జ‌ల వివ‌రాల‌న్నీ సేక‌రించామ‌న్నారు. దేశంలో ప్ర‌తి ప‌దేళ్లకోసారి జ‌నాభా లెక్క‌ల సేక‌రణ జ‌రిగితే ఏపీలో ప్ర‌తి రోజూ సేక‌రిస్తున్నామ‌ని, ఈ డాటా వ‌ల్ల ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం పెద్ద పెద్ద కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌గ‌లుగుతోంద‌న్నారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కంలో ఏమాత్రం గ‌డువు లేకుండా 10 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూర్చ‌గ‌లిగామ‌ని పేర్కొన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా కాంప్ర‌హెన్సివ్ ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్ విధానం అమ‌లు చేసి ప్ర‌తి పైసాను పార‌ద‌ర్శ‌కంగా ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. కాగిత ర‌హిత పాల‌నను అందిస్తూ కార్య‌క‌లాపాల‌ను పూర్తిగా డిజ‌ట‌లీకర‌ణ చేస్తున్నామ‌ని తెలిపారు.  దేశంలో ఎక్క‌డా లేని విధంగా కంటెంట్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేశామ‌న్నారు.  డ్రోన్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి గంజాయి సాగు లాంటి అక్ర‌మాల‌ను అరిక‌డుతున్నామ‌న్నారు. పుర‌పాల‌క సంఘాల‌కు డ్రోన్ల‌ను ఇచ్చి పారిశుద్ధ్యం ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 4 వేల వ‌ర్చువ‌ల్ త‌ర‌గ‌తి గ‌దుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్‌చంద్ర పునేఠా, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు.ఏ, ముఖ్య కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌, ఆర్థిక శాఖ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ర‌విచంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ దాదాపు గంట‌న్న‌ర పాటు గ‌డిపారు. ప్ర‌తి అంశాన్ని చాలా ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు.
   

Just In...