Published On: Tue, Jan 8th, 2019

‘సీఎం సీటుపై కలలు కనకుండా రోజు గడవదు’

* వైకాపా అధ్యక్షుడు జగన్‌పై మంత్రి దేవినేని విమర్శలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: అమరావతి: పోలవరం ప్రాజెక్టు గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కడం చాలా సంతోషంగా ఉందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ విడిది కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఒక్కరోజు వ్యవధిలో 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశమంతా తెలుగువాడి సత్తాను అభినందిస్తుంటే వైకాపా అధ్యక్షుడు జగన్ ఓర్వలేక పోతున్నారని.. గిన్నిస్ రికార్డు పేరుతో నాటకం అంటూ తన అవినీతి పత్రికలో విషం ‌చిమ్మడం‌ దుర్మార్గమని మంత్రి విమర్శించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. వేలాది మంది కార్మికులు, ఇంజినీర్ల 24 గంటల ‌శ్రమను జగన్‌ అవమానించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబును తిట్టకుండా, సీఎం సీటుపై కలలు కనకుండా జగన్‌కు రోజు గడవదని మంత్రి మండిపడ్డారు. ఎన్ని‌ అవాంతరాలు ఎదురైనా చంద్రబాబు నిధులు కేటాయించి పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా జగన్ నోరు మెదపడం లేదని మంత్రి ఉమా విమర్శించారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసిఆర్‌తో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రణాళికల వల్లే నేడు అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రూ.10,449 కోట్ల పోలవరం పనులు చేస్తే రూ.25వేల కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ డైరెక్షన్‌లో చంద్రబాబుపై జగన్‌ కుట్రలు చేస్తున్నారని.. అలాంటి వాళ్లు ఎంతమంది అడ్డుపడినా పోలవరం పూర్తి చేసి రైతాంగానికి చంద్రబాబు కానుకగా అందిస్తారని దేవినేని స్ప‌ష్టం చేశారు.

Just In...