Published On: Fri, Jan 11th, 2019

పింఛనుదారులకు ఏపీ స‌ర్కారు సంక్రాంతి కానుక

* వృద్ధులు, వితంతువులు పింఛను సొమ్ము రెట్టింపు చేస్తున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛనుదారులకు సంక్రాంతి కానుక అందించారు. నెలనెలా వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛను సొమ్ము రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని తెలిపారు. పాత, కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో రూ.3వేలు అందిస్తామన్నారు. మార్చి నుంచి అంతా రూ.2వేలు పింఛను తీసుకుంటారని స్పష్టంచేశారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా బోగూరులో శుక్ర‌వారం నిర్వహించిన ‘జన్మభూమి – మాఊరు’ కార్యక్రమంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులెవరూ అధైర్యపడొద్దని అప్పట్లో రూ.200గా ఉన్న పింఛనును రూ.1000కి పెంచామన్నారు. దాన్ని మరోసారి రెట్టింపు చేస్తూ జనవరి నుంచి నెలనెలా రూ.2వేలు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని భరోసా ఇచ్చానని గుర్తు చేశారు. నెలనెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో.. అదే తరహాలో పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. వృద్ధులు, వితంతువులు వయోభారంతో, మందులు కొనుక్కొనేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే పింఛన్లు పెంచామన్నారు. ఎంత ఖర్చయినా పర్వాలేదని, పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని.. తిరిగి ఆ సంపదను ప్రజలకే పంచుతానని చంద్రబాబు తెలిపారు. ప్రతినెలా ఇచ్చే పింఛను సొమ్ము రెట్టింపు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 54లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.
 

Just In...