Published On: Sun, Feb 10th, 2019

సంకల్పంతో సాధించాలి..!

* ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
* ఎన్టీఆర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
* కొత్త ఆలోచనలను ఆవిష్కరించాలి
* ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయం నెరవేర్చాలి
* స్వర్గానికి ప్రతిరూపమే అమరావతి
* ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సెల్ఐటి న్యూస్‌, అమరావతి: జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు సంకల్పంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ విద్యార్ధులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏ ఆశయంతో 2005లో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ను ప్రారంభించామో, ఆ లక్ష్యం నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఎంతోమంది నాయకులు, కార్యకర్తలను నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు  చంపేశారని తెలిపారు. అలాంటి వారి కుటుంబాలు రోడ్డున పడకూడదని, వారి పిల్లల చదువులు ఆగకూడదనే ఉద్ధేశ్యంతో స్కూల్ ను ప్రారంభించామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తలు, తమ పిల్లలను చదివించుకోలేని వారి పిల్లలకు కూడా ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో, చల్లపల్లిలో, వరంగల్ లో మొత్తం మూడు స్కూళ్లను నడుపుతున్నట్లు  చెప్పారు. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరని, ఈ స్కూల్ లో చదువుకున్న ప్రతి విద్యార్ధి ఎన్టీఆర్ క్రమశిక్షణను పాటించి, ఆయనలా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, కఠోర శ్రమ, లక్ష్యసాధన వల్లే అది సాధ్యమైందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి అందరిలో ఉండాలన్నారు. ఆయన జీవితం తెలుసుకోవాలంటే ఎన్టీఆర్ సినిమా చూడాలని విద్యార్ధులకు సూచించారు. ఎన్టీఆర్ ను తలచుకుని ఏ సంకల్పం చేపట్టినా నెరవేరుతుందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ ద్వారా 5633 మంది కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చామన్నారు. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ట్రస్ట్ సభ్యులు విజయవంతంగా ట్రస్ట్ ను నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఒక్క విద్యే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 17 లక్షల మందికి సహాయం అందించామని, 11 లక్షల 50 వేల మందికి వైద్య సహాయం అందించామని, 2.75 లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. కృష్ణా వరదలు వచ్చినప్పుడు రూ.15 కోట్ల సహాయం అందించామని, ఉత్తరాఖండ్ వరదల్లో తెలుగువారు చిక్కుకుంటే, ప్రత్యేక విమానాల ద్వారా వారిని రక్షించి తీసుకువచ్చామని వెల్లడించారు.
                స్కూల్ ప్రారంభించిన మొదట్లో తాను విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడినప్పుడు, తన తండ్రిని చంపిన వారిని చంపాలనే ప్రతీకారంతో విద్యార్ధులు ఉండేవారని గుర్తుచేశారు. వారి బాధ పగగా మారిందని, కానీ తన లక్ష్యం అది కాదని చెప్పానన్నారు. పదిమందికి జీవితాన్ని ఇచ్చే వారిగా ఎదగాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో పుట్టారని, అడుగడుగునా అంటరానితనాన్ని భరించారని తెలిపారు. కానీ ఏనాడూ పట్టుదల వదలకుండా శ్రమించి ఉన్నత స్ధాయికి ఎదిగారన్నారు. మన భవిష్యత్తు, జీవతం జన్మ మీద, అదృష్టం మీద ఆధారపడి ఉండదని, మన ఆలోచనల మీద, పనుల మీద ఆధారపడి ఉంటుందని విద్యార్ధులకు హిత బోధ చేశారు. పేదలు ఉన్నంత వరకు అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారని, కారణం ఆయన రాసిన రాజ్యాంగమని తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చామని ఆత్మనూన్యతా భావానికి లోనుకావద్దని, పెద్ద ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. యాపిల్ వ్యవస్ధాపకులు స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లల జీవితాల గురించి వివరించి, విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలని, కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడితే విజయాలు సాధించవచ్చన్నారు. ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడే విజన్ 2020 కి శ్రీకారం చుట్టానని, దాని ఫలితమే నేటి సైబరాబాద్, హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రమం, ఔటర్ రింగ్ రోడ్డని వెల్లడించారు. ఒక విజన్ తో ముందుకు వెళ్లాం కాబట్టే, హైదరాబాద్ కు దేశంలో ఎక్కడా లేని ఒక ఎకో సిస్టమ్ తీసుకువచ్చామన్నారు. ఇప్పుడు రాష్ర్ట విభజన జరిగాక, భాధపడుతూ కూర్చోలేదని, దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతిని తయారు చేయాలని విజన్‌తో ముందుకు వెళుతున్నామని, చాలా వరకు సాధించామని పేర్కొన్నారు. ఒక నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, తలసరి ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. 670 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ప్రతిభకు గీటురాయి అవార్డులన్నారు.
                 1995లో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశామని, దాని ఫలితమే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చూపి, సంపన్నులుగా ఎదిగారని చెప్పారు. ఏదైనా ఇష్టపడి పనిచేయాలని, అప్పుడు ఏ మాత్రం కష్టం అనిపించదని అన్నారు. సాధించాలనే పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. తాను చిన్నవయస్సులో 6 కిలోమీటర్ల దూరం రోజూ నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవాడినని, పాత రోజులను గుర్తుచేసుకున్నారు. జన్మనిచ్చిన తల్లిని చాలా మంది మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మాతృమూర్తికి వందనం అను కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అమరావతి దేవతల రాజధానిగా అభివర్ణించారు. స్వర్గాన్ని తలపించేలా రాజధాని నిర్మాణం చేపడుతామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ స్కూల్ లో చదువుకున్న విద్యార్ధులంతా ఉన్నత స్థాయికి ఎదగాలని, ట్రస్ట్ కి మంచిపేరు తీసుకురావాలని కోరారు. విద్యార్ధులందరికీ తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
               మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నిత్య కృషీవలుడని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జీవితం అన్ని సమస్యల సమాహారమని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లి విజయాలు సాధించాలని సూచించారు. మన జీవితం మన చేతుల్లోనే ఉందని, మనం వెళ్లే దారిలో నిరుత్సాహపరిచే వారు ఎందరో ఉంటారని, ఆశాభావంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎవరూ వారికి వారిని  తక్కువ అంచనా వేసుకోవద్దని, మీ బలమే మీకు రక్ష అని ధైర్యం చెప్పారు. ఎన్ని రకాల పనులు నేర్చుకుంటే అన్ని అవకాశాలు వస్తాయన్నారు. మనం పుట్టినందుకు జీవితాన్ని సార్ధకం చేసుకునేలా జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాయామం, వక్తిత్వం లాంటి పది సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రసంగం అనంతరం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిలు విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్వీ ‍యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో విష్ణువర్థనరావు, సీవోవో వై.మోహనరావు, డైరెక్టర్ ఎన్.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
   

Just In...