Published On: Sun, Feb 10th, 2019

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం – సామాన్యులను చట్టసభలకు పంపిద్ధాం

* బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు గడచిన నాలుగున్నర కాలంలో డబ్బున్న బడాబాబులకు ఊడిగం చేశారని, ఎన్నికలు దగ్గరపడడంతో చివరి మూడు నెలలు పేదల జపం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సి.పి.ఐ. నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన శుక్రవారం రాత్రి పాత రాజరాజేశ్వరిపేటలో ధనస్వామ్యమా? ప్రజాస్వామ్యమా? అనే అంశంపై జరిగిన బహిరంగసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఇంతకాలం దోచుకున్న సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుబెట్టి మళ్ళీ గెలుపొంది అధికారం కైవసం చేసుకోవాలని మోడీ, చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చేస్తున్నారని, ధనస్వామ్యానికి చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, నిజాయితీపరులైన సామాన్యులను ఎన్నుకొని చట్టసభలకు పంపించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతులు, కార్మికులు, మహిళలు, యువత సంక్షేమం అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్నాళ్ళు మోడీకి రైతులు గుర్తుకురాలేదని, ఎన్నికలవేళ రైతుల అక్కౌంట్లో రు. 6 వేలు జమచేస్తున్నామని చెప్పుతున్నారని అన్నారు. చంద్రబాబూకూడా రాష్ట్రంలో ఒక్క హామీని అమలుచేయకుండా మోసంచేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాయిలాలు విసురుతున్నారని విమర్శించారు. రోజుకి రూ.33 ఉన్న ఫించన్‌ను రూ.66కి పెంచి పేదలకు తాను పెద్దకొడుకునని చంద్రబాబు ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని రూ.94 వేల కోట్ల అప్పును రూ.2.49 లక్షల కోట్లకు పెంచటం మాత్రమే చంద్రబాబు చేసిన అభివృద్ది అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనేత జగన్‌కు సిఎం కుర్చీపైనే ద్యాస అని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన టిడిపి ప్రభుత్వానికి, అసమర్థ ప్రతిపక్ష వైసిపికి ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, నిజాయితీగా అవినీతిరహిత పాలన అందించేందుకు ప్రత్యామ్నాయ కూటమిగా ఏర్పడ్డ సిపిఐ, సిపియం, జనసేన పార్టీలను ఆదరించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ మాట్లాడుతూ డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ రచించిన భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. మతోన్మాద బిజెపి పాలనలో దళితులు, గిరిజనులు ముస్లీం, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీచేస్తున్నారన్నారు. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వ‌స్తే మద్యం నియంత్రిస్తానని హామీ ఇచ్చారని, కాని ముఖ్యమంత్రి అయ్యాక మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, వీధికో మద్యం దుకాణం పెట్టించినందుకా మళ్ళీ చంద్రబాబూనే గెలిపించాలి అంటూ ప్రశ్నించారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రాజరాజేశ్వరిపేట కమ్యూనిస్టుల కోట అన్నారు. కమ్యూనిస్టుల భూపోరాటాలతో రాజరాజేశ్వరిపేట పుట్టిందని, కమ్యూనిస్టుల పాలనలోనే అభివృద్ధి చెందిందన్నారు. తాము కార్పొరేటర్లుగా ఉన్న కాలంలోనే పెద్ద ఎత్తున నిధులు తెచ్చి పేటను అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రస్తుత కార్పొరేటర్లు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లుగా అవతారాలు ఎత్తి గద్దల్లా వాలిపోతూ డబ్బుల కోసం ప్రజలను పీడిస్తున్నారని అన్నారు. మార్పు కోసం, అభివృద్ధి కోసం కమ్యూనిస్టులనే గెలిపించాలని కోరారు. సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఏపీకి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తీరని అన్యాయం చేశారని, ఆ పాపంలో ముఖ్యమంత్రి చందబ్రాబు వాటా కూడా వుంద‌న్నారు. నాలుగున్నరేళ్ళు బిజెపితో అంటకాగిన టిడిపి నేడు ధర్మపోరాట దీక్ష చేస్తాననడం సిగ్గుచేటన్నారు. కార్య‌క్ర‌మానికి మాజీ కార్పొరేటర్ బుట్టి రాయప్ప స్వాగతం పలుకగా సిపిఐ 49వ డివిజన్ కార్యదర్శి ఖలీల్ బేగ్ వందన సమర్పణ చేశారు. కార్య‌క్ర‌మంలో సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు లంక దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అప్స‌ర్‌, స్థానిక నాయకులు ఉప్పు శ్రీను, పైడి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి గాయకులు ఆర్.పిచ్చయ్య, ఎస్.కె.నజీర్, డి.పెదవెంకటేశ్వర్లు విప్లవ గేయాలు ఆల‌పించారు. పటమటలంక ప్రజాన్యామండలికి చెందిన లంక ఆదర్శి, పాతరాజరాజేశ్వరిపేటలోని ఎస్.ఎస్.ఆర్. పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా అలరించాయి.

Just In...