Published On: Wed, Feb 27th, 2019

గిరిజన ప్రాంతంలోని కుటుంబాలకు ఫుడ్ బాస్కెట్ పధకం

* మార్చి 1న ప్రారంభం

* ఏపి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల పౌష్టికాహార స్థాయిని పెంపొందించే లక్ష్యంతో వివిధ నిత్యావసర సరుకులు అందించే ఫుడ్ బాస్కెట్ అనే పధకానికి ఫిబ్రవరి 13న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టగా దానికి సంబంధించిన సరుకుల పంపిణీని మార్చి 1న ప్రారంభించనున్నారు. ట్రైబల్ రిఫార్మ్ యార్డిస్టిక్ (టిఆర్వై)అంశంపై బుధవారం అమరావతి సచివాలయంలో 3వ రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. గిరిజనుల్లో పౌష్టికాహార స్థాయిని పెంచేందుకు ఫుడ్ బాస్కెట్ పధకం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని 2లక్షల కుంటుంబాలకు రూ.532 విలువైన వివిధ నిత్యావసర సరుకులతో కూడిన ఫుడ్ బాస్కెట్ కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో కందిపప్పు, రాగి ప్లేవర్, బెల్లం, సన్‌ఫ్లవర్ ఆయిల్, డిఎఫ్ఏ సాల్టు వంటి ఆరు రకాల నిత్యావసర సరుకులు ఉంటాయి. ఈ సందర్భంగా సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి గిరిజనుడికి కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి సేవలు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మాస్టర్ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు వివిధ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలు, పధకాల అమలులో స్థానిక ప్రజలను పూర్తిగా భాగస్వామ్యం చేయాలని అప్పుడే ఆయా కార్యక్రమాలు పూర్తిగా విజయవంత‌మ‌వుతాయని ఆదిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు గ్రామ, ఆవాస ప్రాంతం స్థాయిలో స్థానిక ప్రజలను ముఖ్యంగా పెద్దలను పెద్దఎత్తున చైతన్య వంతం చేసేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ఆయా పధకాలు, కార్యక్రమాలు వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు కేవలం లక్ష్యాలు వాటి సాధనపైనే దృష్టి సారించకుండా ఆయా కార్యక్రమాలు, పధకాల అమలుతో వచ్చే ఫలితాలు తద్వారా ప్రజలకు కలిగే మేలును దృష్టిలో ఉంచుకుని గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ స్పష్టం చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ 2016 సెప్టెంబరు 6న రాష్ట్రంలో ట్రైబల్ రిఫార్మ్ యార్డిస్టిక్(టిఆర్వై)అమలును రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యం, విద్య, తాగునీరు, రహదారులు వంటి కనీస సౌకర్యాలను పూర్తిగా అందు బాటులోకి తెచ్చేందుకు పెద్దఎత్తున ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. టిఆర్వై కింద చేపట్టిన వివిధ పధకాలు, కార్యక్రమాలను వైద్య ఆరోగ్యశాఖ సమన్వయం చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యపరంగా ప్రాధమిక, సెకండరీ ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేయడం, అనేక వినూత్నమైన చర్యలు చేపట్టడంతో నేడు గిరిజన ప్రాంతాల్లో వివిధ వ్యాధులను నియంత్రించడంతో పాటు వైద్య ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు సాధించడం జరుగుతోందని చెప్పారు. పాడేరు ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్పు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టిందని, గిరిజన ప్రాంతంలో ఉన్న 153 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంట‌లు పాటు పనిచేసేలా చర్యలు తీసుకున్నామని, 40 ఆరోగ్య ఉప కేంద్రాలను ఇ-ఆరోగ్య ఉప కేంద్రాలుగా మార్పు చేసి అవసరమైన మందులు పూర్తిగా అందుబాటులో ఉంచడం, టెలీమెడిసిన్ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. 2016లో గిరిజన ప్రాంతాల్లో 4,600 ఇళ్ల వద్ద ప్రసవాలు జరిగితే దానిని 2018 నాటికి 1386కు తగ్గించి అధిక సంఖ్యలో ఆసుపత్రుల ప్రసవాలకు ప్రోత్సహించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డాక్ట‌ర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని 851 ఆవాస ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాల్సి ఉండగా ఇప్పటికే 351 ఆవాసాలకు ఆసౌకర్యాన్ని కల్పించగా మిగతా 500 ఆవాసాలకు చేపట్టిన పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. అన్ని గ్రామాలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ ఐటిడిఏల వారిగా మాస్టర్ ప్రణాళికలు రూపొందించి గిరిజనులకు తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలనకు ప్రాధాన్యతను ఇచ్చి అవి పూర్తిగా అందించేందుకు ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. రెండళ్లలో ఇంకా రహదారి సౌకర్యం లేని 3,124 గ్రామాలకు కనక్టవిటీని కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖ కమీషనర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని 24 సిడిపిఓ ప్రాజెక్టుల ద్వారా గిరిజన ప్రాంత మహిళలు, చిన్నారులకు తగిన పౌష్టికాహారం అందించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. చంద్రన్న గిరిపోషణ పధకం కింద గిరిజన ప్రాంతంలోని 23వేల 225 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వండిన ఆహారం అందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు జి.చంద్రుడు, ఆయుష్ విభాగం కమీషనర్ శోభ, ఎపి ఫైబర్ నెట్ సిఇఓ దినేష్‌కుమార్, పార్వతీపురం పిఓ ఐటిడిఏ లక్ష్మీషా, డిఎంఇ డాక్ట‌ర్ బాబ్జీ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...