Published On: Fri, Apr 12th, 2019

స‌మ‌న్వ‌యంతోనే ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ విజ‌య‌వంతం

* ఉత్సాహంతో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు 

* రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: పోలింగ్ ప్రక్రియకు సహకరించిన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్ధులు, సెక్టార్ మేజిస్ట్రేట్లు, ఎన్నికల విధుల్లో భాగస్వాములైన వారు, బూత్ లెవల్ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, సిఆర్పీఎఫ్ దళాలు, రవాణా, కేంద్ర ప్రభుత్వ శాఖలైన ఐటి, బిఎస్‌ఎన్‌ఎల్, బెల్, ఇసిఐఎల్ ఇంజనీర్లు, ఎన్‌సిసి వాలెంటీర్లు, పౌర సంఘాలు, పోలీసు యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల నమోదు నుంచి ఏప్రియల్, 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు అత్యధిక స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకంగా నిలిచిందన్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తినా, ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలు, అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసు అధికారులు, కేంద్ర బలగాలు, ఎన్¬సి¬సి, స్కౌట్ అండ్ గైడ్స్, ఇతర భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డు ఉద్యోగులు ఎన్నికల ఓటింగు ప్రక్రియ విజయవంతంగా ముగించడంలో వారి సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కలుగజేశామన్నారు. ఎంతో ఓపికగా ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఓటు హక్కు విలువను చాటిచెప్పారని ద్వివేది తెలియజేశారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల కార్యాలయం నుండి వార్డు, గ్రామ, డివిజన్ స్థాయిలోని చివరి స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరు వారి యొక్క బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు సుజాత శర్మ, వివేక్‌యాదవ్, అదనపు డిజి రవిశంకర్, ఎక్సైజ్ కమీషనర్ ముఖేష్‌కుమార్ మీనా,  సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారులు డి.మార్కండేయులు, నాగమణి,  సాంకేతిక బృందం, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అతితక్కువ సమయంలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించగలిగామన్నారు.

Just In...