Published On: Sat, Apr 20th, 2019

ఆర్థిక శక్తితో పాటు ఆరోగ్య శక్తి కూడా అవసరం

* ఆరోగ్యవంతమైన దేశం ఆర్థికాభివృద్ధిని వేగంగా సాధిస్తుంది

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా దృష్టి సారించాలి

* ప్రైవేటు సంస్థలు సైతం నాణ్యమైన వైద్య సేవలను అన్ని వర్గాలకు  అందుబాటులోకి తేవాలి 

* ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్స‌వంలో ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయ‌డు

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: ఆర్థిక శక్తితో పాటు, ఆరోగ్య శక్తి కూడా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ఆరోగ్యవంతమైన దేశం శక్తివంతమైన దేశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, అదే సమయంలో శక్తి వంతమైన దేశం ఆరోగ్యవంతమైన దేశంగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శ‌నివారం ఉద‌యం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద మరింతగా దృష్టి కేంద్రీకరించాలని, నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని, తద్వారా ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాల వైపు మళ్ళించి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం… తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని ఈ నేపథ్యంలో యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు. అహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితికి చరమ గీతం పాడి భారతీయ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. మన పెద్దలు కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు సూచించారని, వారు చూపిన బాటలో ముందుకు సాగి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. సూర్యరశ్మి, పచ్చదనం, వ్యాయామం, ఆహారం క్రమశిక్షణ (డైట్), ఆత్మవిశ్వాసం, మిత్రులు అనే ఆరింటికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే అంతకు మించిన వైద్య సహాయం అవసరం లేదని ఆయ‌న అభిప్రాయపడ్డారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండె, మూత్ర పిండాలు మరియు సాధారణ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన కేర్ హాస్పిటల్స్ కు, అదే విధంగా రొమ్ములకు మమో గ్రఫి, గర్భాశయానికి స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఏక్స్ రే లాంటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించి, రిపోర్టులు అందజేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారికి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి ఓ చక్కని వేదికని, ఆసక్తి గల ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ ఛైర్మన్ సోమరాజు దేశం గర్వించదగ్గ హృద్రోగ వైద్య నిపుణులని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఆరోగ్యం పాడయ్యాక వైద్య సేవలు పొందడం కంటే, ముందుగానే వాటిని గుర్తించి సత్వరం వైద్య సహాయం అందుకోవడం, అసలు అనారోగ్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం మేలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, జీఎంఆర్ గ్రూప్, ఎల్ అండ్ టి, హీరో, గ్రాన్యూల్ ఇండియా, హర్ష టయోటా , మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సియంట్ ఆటో కంపెనీ తదితర సంస్థలను ఉపరాష్ట్రపతి పేరుపేరునా అభినందించారు.  ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్ట‌ర్ లింగమ‌నేని ప్రభాకర్, కేర్ హాస్పిటల్స్ ఛైర్మన్ బి.సోమరాజు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కోశాధికారి జె.ఎస్.ఆర్. ప్రసాద్, స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సి.కృష్ణప్రసాద్, సెక్రటరీ బి.సుబ్బారెడ్డి, డైరక్టర్ కె.రవి తదితరులు పాల్గొన్నారు.
ఉప‌రాష్ట్రప‌తి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్ చాప్టర్ లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విచ్చేసిన మీ అందరికీ అభినందనలు. ఎన్ని పనుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని అందిస్తాయి. ఎందుకంటే ఈ ట్రస్ట్ సేవా భావానికి ప్రతీక.
* సమాజంలో ఎవరికీ ఆస్పత్రి అవసరం రాకూడదు అనుకునే వ్యక్తిని నేను. ఆస్పత్రులు వైద్య పరీక్షలు చేయడానికి, రానున్న వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉంటాను.
* ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా కాలుష్యం. నీరు, గాలి, నేల, ఆకాశం… చివరకు ఆలోచనతో సహా అంతా కాలుష్యం. ఈ పరిస్థితుల్లో ఎంతో మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. వీటి బారి నుంచి పేదలకు దన్నుగా నిలిచేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము.
* 2001లో స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి  ఈ 18 సంవత్సరాల్లో దాదాపు 250కి పైగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగింది.
* ఈసారి కూడా స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ముదావహం. ఈ సారి వైద్య శిబిరానికి తమ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన కేర్ హాస్పిటల్స్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభినందనలు తెలియజేస్తున్నాను.
* భారతీయ సంస్కృతి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే, అందరిని ఆరోగ్యమస్తు, ఆయుష్మాన్ భవ అని దీవించే సంప్రదాయం మనది.
* స్వతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా పేదలకు, గ్రామాలకు వైద్యం అందని దుస్థితి ఉండేది. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత కూడా కొన్ని గ్రామాలకు వైద్యం అందకపోవడం విచారకరం. వైద్యం మరింత ఖరీదుగా మారిన ఈ రోజుల్లో ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాల్లోని పేదలకు ఉన్నత స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే స్వర్ణభారత్ లక్ష్యాల్లో ఒకటి.
* నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే గ్రామీణ్ సడక్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించాను. కానీ ఆ రోడ్లు ఆర్థికంగానే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, అతి త్వరగా దగ్గరలోని ఆస్పత్రులకు చేరేందుకు ప్రజలకు ఉపయోగపడ్డాయి.
* ఒక దేశంలో ప్రజల ఆరోగ్యం దేశ ఆర్థికాభివృద్ధిని శాసిస్తుంది. ఆరోగ్యకరమైన సమాజం ద్వారా, దీని మీద పెట్టే ఖర్చును ఇతర రంగాల మీదకు మళ్ళించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
* విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు పార్లమెంట్, పొలిటికల్ పార్టీలు, పత్రికలు, ప్రభుత్వాలు పెద్ద పీట వేసి, ప్రాధాన్యత ఇవ్వాలి. కేటాయింపులు పెంచాలి. కొత్త ఆలోచనలు పంచాలి. ఇక్కడ కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేదు. అందరికీ సమాన బాధ్యత ఉంటుంది
* సాధారణంగా ఉచిత వైద్య శిబిరాలు అంటే సాధారణ పరీక్షలు మాత్రమే చేస్తారు. కానీ కేర్ హాస్పిటల్ ఆధ్యర్యంలో అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలతో షుగర్ (రాండం), బి.పి, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు నిర్వహించి నిష్ణాతులైన ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలతో పాటు రిపోర్టులు కూడా ఇక్కడ అందజేస్తున్నాం. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది.
* అదేవిధంగా ఆధునిక సదుపాయాలు గల బసవతారకం ఆసుపత్రి మొబైల్ వ్యాను నందు క్యాన్సర్ కు సంబంధించిన అత్యాధునిక వైద్య పరీక్షల సౌకర్యం కూడా ఉంది. నిపుణులైన వైద్య బృందంచే రొమ్ములకు మెమోగ్రఫీ, గర్భాశయం స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్ రే మొదలగు పరీక్షలు ఉచితంగా చేసి, రిపోర్టులు కూడా ఇస్తారు.
* ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినియోగించుకోండి. మీ ఆరోగ్యం పట్ల మీకు అవగాహన ఉండడం తప్పనిసరి. రోగం ముదిరాక వైద్యం చేయించుకోవడం కంటే ముందే గుర్తించి జాగ్రత్తపడడం మేలు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వాటికి తొలిదశలో గుర్తించగలిగితే నివారణ సులువు.
* చికిత్స కంటే నివారణే మంచి మందు అని మన పెద్దలు ఏనాడో తెలియజేశారు. సమస్య వచ్చినప్పుడు వైద్య సహాయం పొందడం కంటే, అసలు సమస్య రాకుండా ఏం చేయాలో అవగాహన తెచ్చుకోవాలి. ఇందులో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించకోవడం ఓ ఎత్తైతే, జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం లాంటివి నిత్యం పాటించాలి
* శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం మన సొంతమౌతుంది. ఇందు కోసం నిత్యం యోగ లాంటి వాటిని అలవాటు చేసుకోండి.
* మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోయే సంస్కృతి కూడా ఒత్తిడితో కూడిన జీవన విధానానికి కారణం అవుతోంది. శరీరానికి సరైన కదలికలు లేకుండా ఒకే చోట కూర్చోవడం లాంటి ఇవాళ్టి పని సంస్కృతి యువతలో అనేక శారీరక మానసిక అనారోగ్యాలను సృష్టిస్తోంది.
*  ఇలాంటి చైతన్య రహిత సంస్కృతికి వీలైనంత వరకూ దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇందు కోసం జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. నిత్యం నడవడం, కనీస వ్యాయామం చేయడం రోజు వారి కార్యక్రమాల్లో భాగంగా మార్చుకోవాలి.
* జీవన విధానంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవడం అనేక సమస్యలను అధిగమించడానికి ఊతమిస్తుంది. పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా మన భారతీయ ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* మన పూర్వీకులు మన కోసం ఓ ప్రత్యేకమైన జీవన విధానంతో పాటు, ఆహారనియమాలను ఏర్పాటు చేశారు. కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆహారంలో మార్పులు సూచించారు. కాల పరీక్షను తట్టుకున్న అలాంటి ఆహారాన్ని తీసుకోవడం అత్యంత అవసరం.
* సూర్యరశ్మి, పచ్చదనం, వ్యాయామం, ఆహారం క్రమశిక్షణ (డైట్), ఆత్మవిశ్వాసం, మిత్రులు…. ఈ ఆరు ఎప్పుడూ మనతోటే ఉంటే అంతకు మించిన వైద్య సహాయం అవసరం లేదు.
* ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహారం విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, యోగాసనాలు లాంటి వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
* సమస్యలకు చికిత్స మాత్రమే కాదు, ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా ఈ శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను.
* భారతీయ సంస్కృతి ఎంతో ఉన్నతమైనది. అందరితో కలిసి పంచుకోవడం (షేర్ అండ్ కేర్ సంస్కృతి) ద్వారా మన పూర్వీకులు చక్కని జీవన విధానాన్ని గడిపారు. మనం కూడా అదే జీవన విధానం దిశగా ముందుకు వెళ్ళి, మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
* ఆర్థిక శక్తితో పాటు, ఆరోగ్యశక్తి కూడా అవసరం. అందుకే మనపెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని ఏనాడో తెలియజేశారు. ఆచరించి చూపించారు. వారి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి, ఆచరణ దిశగా మనమంతా ముందుకు సాగాలి
* ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణం అవుతున్నాయి. ఈ అనారోగ్యాలు మన ఆర్థిక పరిస్థితి మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా మన ఆరోగ్యాన్నే కాదు, మన ఆర్థిక పరిస్థితిని కూడా చక్కదిద్దుకోవచ్చు. అందుకే శాస్త్రీయమైన, ప్రాచీనమైన మన సనాతన జీవనశైలి మీద ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాలి.
* ఆరోగ్యవంతమైన దేశం శక్తివంతమైన దేశం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో శక్తివంతమైన దేశం కచ్చితంగా ఆరోగ్యవంతమైన దేశం అవుతుందని చెప్పలేము.
* ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. ప్రజారోగ్యం మీద దృష్టిని మరింత పెంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్యతో పాటు, మరింత నాణ్యమైన వైద్య సేవల మీద దృష్టి కేంద్రీకరించాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా, వారి ఆరోగ్యం కోసం ఖర్చు చేసే మొత్తాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించి, అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి
* కేవలం ప్రభుత్వాలే కాదు ప్రైవేటు వైద్య శాలలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. వైద్య రంగాన్ని సేవా రంగంగా భావించి, నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పేదలకు అందుబాటులో ఉండేలా ప్రయత్నించాలి.
 

Just In...