Published On: Sat, May 18th, 2019

విజ‌య‌వాడ‌లో పలు నేరాలకు పాల్పడిన అంతరరాష్ట్ర నేరస్తులు అరెస్టు

* సుమారు రూ.54.60 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు.. 
* రూ.9.65 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, రెండు కార్లు స్వాధీనం 
* విజ‌య‌వాడ సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు వెల్ల‌డి
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో ప‌లు నేరాల‌కు పాల్ప‌డుతున్న పాత నేర‌స్తుల‌ను అరెస్టు చేసి వారి వ‌ద్ద నుంచి సుమారు రూ.54.60 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు రూ.9.65 లక్షలు నగదు, ఒక ల్యాప్‌టాప్‌, మరియు నేరానికి ఉపయోగించిన రెండు కార్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు చెప్పారు. ఈ విష‌య‌మై శుక్ర‌వారం త‌న ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు మాట్లాడుతూ ఇటీవ‌ల కాలంలో పాత నేర‌స్తుల‌పై నిఘా ఉంచిన నేప‌ధ్యంలో సిసిఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు విజయవాడ నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండ్రిక గ్రామం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండ‌గా రెండు కార్లలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండ‌టాన్ని గ‌మనించి వారిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింద‌న్నారు. విచారణలో నిందితులు విజయవాడ నగరంతో పాటు వివిధ జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన పాత నేరస్థులుగా గుర్తించామ‌న్నారు. కృష్ణాజిల్లా, ఏ.కొండూరు గ్రామం, చైతన్యనగర్‌కు చెందిన భూక్యా నాగరాజు నాయక్(38), గుంటూరు జిల్లా, పాత గుంటూరుకు చెందిన పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు అలియాస్ బుజ్జి(41), కృష్ణాజిల్లా, విస్సన్నపేట మండలం, చంద్రపట్లతండాకు చెందిన బాణావత్ రాజా(24), 16 సంవత్సరాల జువనైల్, జైల్లో ఉన్న నిందితులు నల్లమోతు సురేష్, గుత్తికొండ పవన్‌కుమార్ నిందితులు విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆత్కూరు, సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌న‌గ‌ర్‌, గన్నవరం, కృష్ణలంక పోలీస్‌స్టేషన్ల ప‌రిధితో పాటు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణుకు మరియు భీమడోలు మరియు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్ళే రహదారిలో రాత్రి సమయాల్లో ఇళ్ళ దొంగతనాలకు పాల్పడ్డార‌ని తెలిపారు. ఈ నేపధ్యంలో నిందితుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, జువైన‌ల్స్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగింద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో వివిధ రకాల నేరాలకు పాల్పడిన పాత నేరస్థులైన భూక్యా నాగరాజు నాయక్, పుల్లేటికుర్తి ఉమామహేశ్వర రావు అలియాస్ బుజ్జిలు నేరాలు చేసి జైలుకు వెళ్ళిన సమయంలో అక్కడ వీరి మధ్య స్నేహం కుదిరింద‌ని తెలిపారు. వీరు జైలు నుండి బయటకు వచ్చిన తరువాత భూక్యా నాగరాజు నాయక్ సమీప బంధువైన బాణావత్ రాజాతో కలసి చెడు వ్యసనాలకు పాల్ప‌డుతూ మరియు బేకరి షాపు పెట్టుకోవడానికి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కార్లలో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో వివిధ నేరాలకు పాల్పడ్డార‌ని పేర్కొన్నారు. వీరు ముగ్గురు మరియు జువనైల్ నిందితునితో కలసి విజయవాడ నగరంలోని ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019 మార్చి నెలలో ఒక చోరీ, పుల్లేటికుర్తి ఉమామహేశ్వర రావు అలియాస్ బుజ్జి ప్రస్తుతం వైజాగ్ జైల్లో ఉన్న మరో నిందితుతైన నల్లమోతు సురేష్‌తో కలసి గన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018 జూన్ నెలలో ఒక చోరి,  భూక్యా నాగరాజు నాయక్, ప్రస్తుతం వైజాగ్ జైల్లో ఉన్న మరో నిందితుడైన గుత్తికొండ పవన్‌కుమార్‌తో కలసి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2011, 2016 సంవ‌త్స‌రాల్లో రెండు చోరీల‌కు, భూక్యానాగరాజు నాయక్, బాణావత్ రాజాలు కలసి కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015 మార్చి నెలలో ఒక చోరీకి  పాల్ప‌డ్డార‌ని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు. ఈ క్ర‌మంలో విజయవాడ నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండ్రిక గ్రామం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండ‌గా నిందితుల‌ను గుర్తించి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో క్రైమ్ డిసిపి బి.రాజకుమారి, సి.సి.యస్ ఏసిపి కె.ప్రకాష్‌రావు పాల్గొన్నారు. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించి నిందితులను గుర్తించడంతో పాటు వారిని అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ బి.బాలమురళీకృష్ణ, యం.యు.ఎన్.శివాజీరావు, ఎస్.ఐ సి.హెచ్. నాగశ్రీనివాస్, ఎస్.ఐ.జి.కృష్ణారావు, మ‌రియు సిబ్బందిని, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Just In...