Published On: Sun, May 19th, 2019

అన‌ధికారికంగా తరలిస్తున్న రూ.1,31,98,000లు నగదును స్వాధీనం

* టాస్క్‌ఫోర్స్ పోలీసుల‌ అదుపులో ముగ్గురు వ్య‌క్తులు
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: ఎటువంటి బిల్లులు లేని సుమారు రూ.1,31,98,000ల నగదు దొడ్డిదారిన త‌ర‌లించేందుకు య‌త్నించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పొట్లాబత్తుని వెంకటేష్ (26), పొట్లాబత్తుని వినయకుమార్(28), జొన్నాదుల అశోక్‌కుమార్ (24) వ్య‌క్తుల‌ను విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్ర‌వారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశంలో విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలసి విజయవాడ వెస్ట్ బుకింగ్ స‌మీపంలోని ఆటోస్టాండ్ దగ్గర రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఎటువంటి బిల్లులు లేని సుమారు రూ.1,31,98,000ల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింద‌న్నారు. పొట్లాబత్తుని వెంకటేష్ మంగళగిరి ప్రాంతంలో జ్యూయలరీ షాపు నిర్వహిస్తున్నాడ‌ని అత‌ని షాపులో జొన్నాదుల అశోక్‌కుమార్ గత కొంత కాలంగా పని చేస్తున్నాడ‌ని తెలిపారు. చెన్నై మరియు ముంబ‌య్‌ ప్రాంతంలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా చట్టవిరుద్దంగా కొనుగోలు చేసిన బంగారాన్ని తన జ్యూయ‌లరీ షాపున‌కు తరలించి విక్రయిస్తుంటార‌ని పేర్కొన్నారు. ఈ క్రమంలో చెన్నైలో బంగారం కొనుగోలు చేయడానికి వెంకటేష్ అతని సోదరుడైన వినయకుమార్ మరియు తన షాపులో పని చేసే అశోక్‌కుమార్ సాయంతో స్వాధీనం చేసుకున్న నగదును రెండు బ్యాగుల్లో సర్థి విజ‌య‌వాడ‌లోని రైల్వే స్టేషన్‌కు చేరుకుని, వెస్ట్ బుకింగ్, ఆటో స్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా తచ్చాడుతుండ‌గా గమనించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింద‌న్నారు. వీరు గత కొంత కాలంగా అక్రమ మార్గంలో ఈ విధంగా వ్యాపారం చేసి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా చట్టవిరుద్దంగా బంగారం తరలించి విక్రయస్తూ అధిక లాభాలు గడిస్తున్నార‌ని తెలిపారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు వెల్ల‌డించారు.

Just In...