Published On: Wed, May 29th, 2019

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇకపైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే..!

* అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె. జైన్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు చెల్లించాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మంగ‌ళ‌వారం విజయవాడలో సమావేశమైంది. ఈ సమావేశానికి అథారిటీ ఛైర్మన్‌ ఆర్‌.కె. జైన్, పీపీఏ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, అధికారులు, నవయుగ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, తదుపరి లక్ష్యాలపై చర్చించారు. పనులు జరుగుతున్న తీరును గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులను ఛైర్మన్‌ జైన్‌ అడిగి తెలుసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌పై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం పనులు మరింత వేగంగా జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది రూ.2 వేల కోట్లేనని.. రాష్ట్రం చెబుతోన్న రూ.4,800 కోట్ల పెండింగ్‌తో తమకు సంబంధం లేదని జైన్‌ వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో డీపీఆర్‌-2కు ఆమోదం లభిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని.. ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని జైన్‌ స్పష్టం చేశారు. మరోవైపు పీపీఏ అధికారులు బుధవారం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించనున్నారు.

 

Just In...