Published On: Fri, Jun 14th, 2019

ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు

* సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ ప్రాధాన్యతలను అనుసరించి సాంఘిక సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను సిద్దం చేయాలని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమంపై ముఖ్యమంత్రి కీలకంగా దృష్టి సారిస్తున్న తరుణంలో అధికారులు తదనుగుణంగా సిద్దం కావాలన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను సిద్దం చేసే క్రమంలో శుక్రవారం సచివాలయంలోని  తన ఛాంబర్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు హర్షవర్ధన్,  గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు గంధం చంద్రుడు తదితరులతో పాటు రెండు శాఖలకు చెందిన విభాగ అధిపతులు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో మీనా మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు విషయం పై సీఎం సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేస్తున్నారని , తదనుగుణంగా సిద్దం కావాలన్నారు. షెడ్యూలు కులాలకు ప్రభుత్వ పరంగా భూమి కొనుగోలు చేసి వారికి అప్పగించే పథకంకు రెట్టింపు నిధులు వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముకేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. షెడ్యూలు కులాల యువతను ఉన్నత స్థానాలలో చూడాలన్నది ప్రభుత్వ ప్రాధాన్యత కాగా స్టడీ సర్కిల్స్ నిర్వహణ కోసం మరింతగా నిధులు కావలసి ఉంటుందన్నారు. సాంఘిక , గిరిజన సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేస్తున్నందున , మ్యాచింగ్ గ్రాంట్‌ల విషయంలో  అప్రమత్తంగా ఉండాలని మీనా స్పష్టం చేశారు. పూర్వపు బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరించాల్సి  ఉందన్నారు. గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో మరింతగా నిధులు కోరాలన్న దిశగా సమావేశం చర్చించింది.  

Just In...