Published On: Tue, Jun 18th, 2019

రైతు కుటుంబాల్లో ఇక విద్యుత్ కాంతులు

* 9 గంటల విద్యుత్ సరఫరాకు ముఖ్యమంత్రి కార్యాచరణ

* నాణ్యత, షెడ్యూల్ పై ప్రత్యేక దృష్టి

* 60 శాతం ఫీడర్ల నుంచి పగటిపూట 9 గంటల విద్యుత్ పై ప్రకటన వారంలోనే

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన మౌలిక అంశాలన్నింటిని తక్షణమే అమలులోకి తెచ్చి రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమావేశమై కార్యాచరణను చర్చించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా అనుసంధానించి అనుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన సాధించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ వినియోగం అవుతుంది. వీటిలో 3,854 ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మొత్తం ఫీడర్లలో ఇవి 60 శాతం. వీటన్నింటిని వారం రోజుల పాటు ట్రయల్ రన్ చేసి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధ్యయనం చేసి లోపాలను సవరించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అధ్యయనం చేసిన తర్వాత వారం రోజుల్లోగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా విషయమై ప్రకటన చేస్తామని అన్నారు. మిగిలిన 40 శాతం.. అంటే 2,809 ఫీడర్లకు పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు. వాటి సామర్థాన్ని పెంచి వాటిని కూడా పూర్తిస్థాయిలో వాడుకలోకి తెచ్చేవిధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి వెంటనే రూ.1700 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

నాణ్యతలో రాజీపడొద్దు…
ప‌గటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసే విప్లవాత్మకమైన ఈ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొంత సమయం పట్టినా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే దిశగానే చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒక వారం రోజుల్లో పగటిపూట 9 గంటల విద్యుత్ వ్యవసాయరంగానికి అందుబాటులో తెచ్చేందుకు నిర్థిష్టమైన ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయానికి అందించడానికి ప్రత్యేకంగా ఫీడర్లను ఏర్పాటు చేయాలని, దీనికి ఒక అధ్యాయనాన్ని కూడా చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఫీడర్ల వారీ షెడ్యూల్…
ఏ ప్రాంతానికి ఎప్పుడు విద్యుత్ సరఫరా చేస్తున్నామో రైతులకు స్పష్టంగా తెలియజేయాలని, దీనిలో గందరగోళం ఉండకూడదని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఫీడర్ల వారీ టైం షెడ్యూల్ ను తయారుచేసి ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా చేసే సమయాలను ఖచ్చితంగా వెల్లడించడమే కాకుండా సరిగా అమలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహ‌న్ రెడ్డి ఆదేశించారు.

Just In...