Published On: Tue, Jul 9th, 2019

వైభవంగా పుబ్బా నక్షత్ర ఉత్సవం  

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం ఆనిమాస పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకుని వైభవంగా జరిగింది. ఇందులో బాగంగా, ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు జరిపి, తరువాత ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను బంగారు తిరుచ్చి మీద, శ్రీ ఆండాళ్ అమ్మవారిని వేరొక బంగారు తిరుచ్చి మీద విశేషంగా అలంకరించి ఆలయం నుంచి చిన్న మాడ వీధి గుండా శ్రీ పెద్ద జియ్యంగార్ మఠానికి చేరుకున్నారు. అక్కడ ఆస్థానం నిర్వహించి సన్నిధి వీది గుండా ఆలయానికి చేరుకున్నారు. అంతకు ముందు ఎనిమిది గంటలకు పుష్పయాగ అంకురార్పణ సందర్భంగా రుత్వికవరణం, రుత్వికులకు వస్త్ర బహుమాన కార్యక్రమాలు నిర్వహించారు.  సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ (పుష్పయాగ సందర్భంగా) నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలలో శ్రీ శ్రీ పెద్ద జియ్యంగార్ స్వామివారు, శ్రీ శ్రీ చిన్నజియ్యంగార్ స్వామివారు, ఆలయ ప్ర‌త్యేక డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఎఇఓ రవిప్రకాష్ రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాష్, ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు, పరిచారకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Just In...