Published On: Thu, Jul 18th, 2019

ఏపీ మంత్రివ‌ర్గం ప్ర‌త్యేక భేటీ..

* శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై చర్చ‌

* 12 బిల్లులకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం గురువారం ఉద‌యం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సంద‌ర్భంగా శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై చర్చించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌ తదితర విషయాలను కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. మొత్తం 12 బిల్లులకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అంగన్వాడీల వేతనం రూ.1000 పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తదితర బిల్లులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా, భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించే ముసాయిదా బిల్లుకు, భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టంలో మార్పులకు ఉద్దేసించిన ముసాయిదాకు సైతం ఆమోద ముద్రవేసింది. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

 

Just In...