Published On: Sat, Aug 10th, 2019

విజయవాడలో 100 ఆవుల మృతి..

* గోవుల మృతిపై సమగ్ర పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు

సెల్ఐటి న్యూస్, విజయవాడ క్రైమ్: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరో కొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆవులు మృతి చెందడంతో వీటికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. అనంతరం గోవుల మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు గోశాల నిర్వాహకులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? ఆ కక్షతోనే విరోధులు ఇలాంటి చర్యకు పూనుకొన్నారా? అనే దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 100 గోవులు మృతి చెందిన గోశాలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు. గోవులు మృతిచెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితికి మించిన గోవులను ఉంచారని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. ఆవుల మృతిపై సమగ్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ పర్యటన సమయంలోనూ నిర్వాహకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఒకరిపై మరొకరు ఆదిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ గోవులను గోశాలలో ఉంచారని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. గ్యాస్ ఎక్కువ అవ్వడం వల్ల గోవులు మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని కలెక్టర్‌కు తెలిపారు. పెద్దమొత్తంలో ఆవుల మృతి చెందడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోశాల నిర్వహణ వల్ల ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమైపోయాయని, ఇప్పుడు గోవుల కళేబరాలను కూడా అక్కడే ఖననం చేయడం వల్ల ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోశాలను పరిశీలించేందుకు వచ్చిన కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ మిషా సింగ్‌తో వారి ఆవేదనను పంచుకున్నారు. మరణించిన గోవులను వేరే ప్రాంతంలో ఖననం చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Just In...