Published On: Thu, Aug 15th, 2019

70 ఏళ్లలో లేనిది 70 రోజుల్లో చేసి చూపించాం

* రైతులకు అండగా ఉంటాం

* ప్రజల కష్టసుఖాలు ఎరిగి నడుచుకుంటున్నాం

* ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం

* ముస్లిం మహిళల భయాన్ని తొలగించాం

* ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో మనమే ముందు

* బలమైన ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

* సుస్థిర పాలనతో ప్రజల ఆకాంక్షలు పెరిగాయి..

* త్వరలో ఛీప్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌

* స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ

సెల్ఐటి న్యూస్, దిల్లీ: అధికరణ 370 రద్దు నిర్ణయంతో సర్దార్‌ పటేల్‌ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముమ్మారు తలాక్‌ లాంటి దురాచారాలను రూపుమాపుతూ మెరుగైన భారతావని నిర్మాణానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 73వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘అందరికీ రక్షాబంధన్‌, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నా సోదరీ, సోదరీమణులందరికీ ఈ రోజు సంతోషం, ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మనం ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం వెనక ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం ఉంది. వారి ప్రాణాలను పణంగాపెట్టి దేశం కోసం పోరాడారు. మన స్వాతంత్ర్యం కోసం ఎందరో ఉరి తాళ్లకు బలయ్యారు. ఈరోజు నేను వారందరినీ గుర్తు చేసుకుంటున్నాను. వారి త్యాగాల వల్ల స్వేచ్ఛతో పాటు మన దేశం పురోగతిలో ముందుకు దూసుకెళ్తోంది. ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం’’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.మద్దతు ధర, పింఛన్ల పథకాల ద్వారా రైతులకు, కార్మికులకు సాంత్వన లభిస్తోంది. నీటి సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని భావించి ఎప్పుడూ లేని విధంగా జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది. వాన నీటి సంరక్షణకు ముందుకొచ్చేవాళ్లని తగినంత ప్రోత్సాహం అందిస్తాం. 2014 ఎన్నికలకు ముందు దేశం మొత్తం కలియ తిగిరాను. ఆ సమయంలో ప్రజల కష్ట సుఖాలను ప్రత్యక్షంగా చూశాను. దేశం పట్ల మనసులో ఏమనుకుంటున్నారో పసిగట్టగలిగాను. ప్రతి ఒక్కరూ దేశంలో మార్పు రావాలని కోరుకున్నారు. ఐదేళ్ల మా పనితనంతో 2019లోనూ ప్రజలను మెప్పించగలిగాం. వ్యవస్థలను గాడిలో పెట్టాం. వేగవంతంగా పనిచేసేలా ముందుకెళుతున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాల సేవలు ప్రశంసనీయం అన్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుతో ఒకే దేశం ఒకే రాజ్యాంగం కల సాకారమైందని మోదీ అన్నారు. ఈ కీలక నిర్ణయానికి పార్లమెంటులో మూడు వంతుల మద్దతు లభించిందన్నారు. 70 ఏళ్లలో చేయలేనిది 70 రోజుల్లోనే పూర్తి చేసి చూపించామన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలయైన ఒకే దేశం ఒకే జెండాను సాకారం చేయగలిగామన్నారు. స్వయంప్రతిపత్తితో అనివీతి పెరిగిపోయిందని.. మహిళలు, యువకులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ సాహసోపేత నిర్ణయంతో కశ్మీర్‌ ఇక అభివృద్ధిలో పరుగులు పెట్టనుందన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సైతం తెరపడనుందన్నారు.
ముమ్మారు తలాక్‌ సమస్యతో ముస్లిం మహిళలు ఇన్నాళ్లు భయం గుప్పిట్లో జీవనం సాగించారని మోదీ అన్నారు. ముమ్మారు తలాక్ బిల్లు చట్టంగా మారడంతో ఇప్పుడు మహిళలంతా ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఏర్పడిందన్నారు. ముస్లిం దేశాలు ఈ విధానానికి ఎప్పుడో స్వస్తి పలికాయన్నారు. సతీసహగమనం, బాల్యవివాహాలు, భ్రూణ హత్యలను రూపుమాపినప్పుడు ముమ్మారు తలాక్‌కు సైతం ఎప్పుడో చరమగీతం పాడాల్సిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ అగ్రపథాన దూసుకెళ్తోందన్నారు. దీంతో విదేశాల్లోనూ విశ్వాసం పొందగలిగామని.. రోజు రోజుకీ ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. 2014కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమేనని.. 2014 నుంచి 19 మధ్య 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరిందన్నారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ మౌలిక రంగాన్ని రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులతో పరుగులు పెట్టించనున్నామన్నారు. రైతుల ఆదాయ రెట్టింపునకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయం రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే దిశగా అడుగులు ప్రారంభించామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మేడిన్‌ ఇండియా, ప్లాస్టిక్‌ రహిత, డిజిటల్‌ చెల్లింపుల విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉండడం, సుపరిపాలన దిశగా అడుగులు వేగంగా పడుతుండడంతో సామాన్య ప్రజలు ఆశలు, ఆకాంక్షలు అమాంతం పెరిగిపోయాయన్నారు. వారి ఆశల్ని, ఆశయాల్ని సాకారం చేసే దిశగా పాలన అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టామన్నారు. రోడ్లు, రైల్వే రంగాల్లో ఆధునిక వసతులు సమకూరుతుండడంతో ప్రజలు విమానాశ్రయాల కోసం వేచిచూస్తున్నారన్నారు. ప్రసంగం సందర్భంగా మోదీ.. దేశ త్రివిద దళాలపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రక్షణలో భాగంగా వారు చూపిన తెగువను ప్రశంసించారు. ఎర్రకోట సాక్షిగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం కోసం త్వరలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను నియమించనున్నామన్నారు.

   

Just In...