Published On: Mon, Aug 19th, 2019

2009 తర్వాత ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదు

* గరిష్ఠంగా 8.05లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వదిలాం

* వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టాం

* అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతిరోజూ వరదలపై సమీక్షిస్తున్నారు

* కొందరు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలి

* నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

సెల్ఐటి న్యూస్, అమరావతి: అధికారులతో సమీక్షలు చేయడం ఒక్కటే తమ బాధ్యత కాదని క్షేత్రస్థాయిలో ప్రజల బాగోగులనూ పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ సరైన సమయంలోనే వరద నీటిని దిగువకు వదిలామన్నారు. వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అన్ని సహాయ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నీటి విడుదల శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని మరోమారు మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఎవ్వరికి నచ్చినట్లు వారు నీటిని విడుదల చేసుకునే పరిస్థితి ఉండదని, నిబంధనల ప్రకారం నీటి విడుదల జరుగుతుందని చెప్పారు. వరదనీరు ఎక్కువగా వచ్చినప్పుడు కొన్ని ఇళ్లు, పొలాలు, మునగడం సహజమని ఇలా ప్రతి అంశాన్ని కొందరు రాజకీయం చేయడం తగదన్నారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇరిగేషన్ అంశంపై స్పష్టత లేదనుకొంటున్నానన్నారు. తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వచ్చే వరద నీరు తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు. ఈనెల 9వ తేదీన శ్రీశైలం, 12వ తేదీన నాగార్జునసాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఆరు రోజుల పాటు 8 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని  శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేశామన్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి కూడా భారీ ఎత్తున నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. వరద ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వరద విషయంలో సత్వరం స్పందించారన్నారు.
గరిష్ఠంగా 8.05లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వదిలినట్లు మంత్రి చెప్పారు. పై నుంచి బ్యారేజ్ కు నీటిమట్టం అంతకంతకూ పెరగుతున్నప్పుడు సకాలంలో స్పందించి ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేస్తున్నప్పటికీ కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. కక్ష్యసాధింపు చర్యలకు దిగి 10 లక్షల క్యూసెక్కుల దాకా నీటిని ఆపి ఉంటే కరకట్ట ప్రాంతమంతా మునిగేదని, అధికార యంత్రాంగం ముందే అప్రమత్తమైనందున కరకట్ట ప్రాంతాన్ని ముంపునకు గురికాకుండా కాపాడగలిగామని పేర్కొన్నారు. 2009 తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదని మళ్లీ 10 యేళ్ల తర్వాత కృష్ణానదికి ఈ స్థాయి వరద వచ్చిందన్నారు. రైతాంగం అంతా ఈ విషయంపై సంతోషంగా ఉందన్నారు. వరదల ప్రభావం వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను, బాధితులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో 46 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు, 14 మండలాలు ముంపుకు గురైయ్యాయని అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఈ రెండు జిల్లాలో దెబ్బతిన్నాయన్నారు. వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సుమారు కృష్ణా జిల్లాలో 15 వేల మంది, గుంటూరు జిల్లాలో 3800 మంది ముంపు బాధితులున్నారన్నారు. కృష్ణా జిల్లాలో 13వేలకు పైగా వరద బాధితులను ఖాళీ చేయించి పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. ఈ విషయమై అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజూ ఎప్పటికప్పుడు మంత్రులను, అధికారులను  అప్రమత్తం చేస్తూ దశాదిశ నిర్ధేశం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందన్నారు. మరో 15 రోజుల పాటు వరద ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు.
ఇక రాయలసీమ విషయానికి వస్తే వరద నీరును రాయలసీమకు మళ్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు దాదాపు రోజుకు 4 టీఎంసీల చొప్పున 35 టీఎంసీల నీటిని మళ్లించే ప్రయత్నం చేశామన్నారు. రాయలసీమలోని ప్రతి జిల్లాలోని రిజర్వాయర్ లలో నీళ్లు నింపుతామన్నారు. ముందుగా తాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇప్పటివరకు వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయర్ లకు నీళ్లు పంపించామన్నారు. సోమశిల, అవుకు, గండికోట రిజర్వాయర్ లకు నీళ్లు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. రాయలసీమకు నీరివ్వడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని మంత్రి స్పష్టం చేశారు.  మంత్రులు, అధికార యంత్రాంగం ఈ విషయమై మరింత చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. వరదల సమయంలో అధికారయంత్రాంగం పనితీరు బాగుందని మంత్రి ప్రశంసించారు. వరదపై అనవసర విషయాలు నడుస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు దాదాపుగా సముద్రంలోకి 250 టీఎంసీలకు పైగా నీటిని సముద్రంలోకి వదిలామని తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ చీఫ్ ఎంవెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Just In...