Published On: Tue, Aug 20th, 2019

దేవదాసి వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తాం

* 14వ శతాబ్దం నేటికీ కొనసాగటం విచారకరం

* దేవదాసి వ్యవస్థ ముగింపు సమావేశంలో రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, సుచరిత

సెల్ఐటి న్యూస్, విజయవాడ: స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు గడిచినా దేవదాసి లాంటి సాంఘిక దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగడం రాష్ట్రానికి, దేశానికి అంత మంచిది కాదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మంగళవారం నగరంలోని మెట్రోపాలిటన్ హోటల్లో ఏర్పాటు చేసిన దేవదాసి వ్యవస్థ ముగింపు సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమీషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ 1988 లో దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి చట్టం వచ్చినా ఇంకా ఆంధ్ర, తెలంగాణాలో 80వేల మంది సాంఘిక దురాచార వ్యవస్థలో కొనసాగడ౦ దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు ఆయా జిల్లాలలో మాతంగి, దేవదాసీలు, జోగినీలు ఉన్నారంటే దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడమేనని, ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి దృష్టి సారిస్తుందన్నారు. సతీసహగమనం, బాల్యవివాహాలు వంటి దురాచారాలను రూపుమాపామని అలాంటిది జోగిని, దేవదాసీలను రూపుమాపడం సాధ్యమేనన్నారు. దేవదాసీలను స్చేచ్చా స్వతంత్రులుగా చేయడానికి అవసరమైతే ఇప్పుడున్న జివోలను, చట్టాలను మార్పు చేస్తామన్నారు. ముఖ్యంగా చదువు లేకపోవడం తదితరమైన కారణాలతో దేవదాసీలు ఇంకా సమాజంలో కొనసాగుతున్నారన్నారు. దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. దేవదాసి వ్యవస్థ రూపుమాపడానికి ఎన్జివో ఆర్గనైజేషన్స్ తదితరులు తగు సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మురికి కూపం నుండి దేవదాసిలను బయటకు తీసుకురావడనికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. దేవదాసి పిల్లలకు గురుకులాలలో ఉచితంగా చదువుకునేందుకు సీట్లు ఇవ్వడంతో పాటు ఈ వ్యవస్థలో మగ్గే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఆరు నెలలకు ఒకసారి దేవదాసి వ్యవస్థపై తీసుకుంటున్న చర్యలపై సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ధైర్యంగా దేవదాసి పిల్లలను వివాహం చేసుకోవడం, అనేక సమస్యలు ఎదుర్కున్న భాస్కర్ అనే వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని అదుకుంటామని మంత్రి తెలిపారు. సమాజంలో సాంఘిక దురాచారమైన దేవదాసి పై ఒక రోజు వర్క్ షాప్తు నిర్వహించిన గంధం చంద్రుడును మంత్రి విశ్వరూప్ తో పాటు పలువురు అభినందించారు.
హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ 14వ శతాబ్దంలో వచ్చిన దురాచారాలు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇలాంటి సాంఘిక దురాచార వ్యవస్థ పై మాట్లాడుకోవడం సిగ్గు చేటన్నారు. తెలిసీ తెలియని వయస్సులో దేవదాసిలుగా దేవాలయాలలో తోయబడుతున్న మహిళల దీన వ్యవస్థ ఊహిస్తేనే దయనీయంగా ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాలలో 80 వేల మంది దేవదాసీలుగా ఉన్నారంటేనే పరిస్థితిని ఆర్ధం చేసుకోవచ్చన్నారు. దేవదాసి చట్టం బలంగా ఉన్నా ఆర్థిక అసమానతలు, పేదరికంతో దేవదాసీలుగా మారడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. దేవదాసిలుగా ఎక్కువ మంది ఎస్సీ, బీసీ, ఎస్టీ, కులాలలో నుంచి మారుతున్నారన్నారు.మనస్సున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి చర్యలు తీసుకుంటారన్నారు. దేవదాసి వ్యవస్థను రూపు మాపడానికి ఉచిత విద్యను అందించడం, ఆర్ధికంగా ఆయా కుటుంబాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు.
మహిళా కమీషనర్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ అధునిక యుగం, చంద్రయానంలో అడుగు పెడుతున్న కాలంలో దేవదాసి వ్యవస్థ ఉండటం విచారకరమన్నారు. 1988 లో చట్టం వచ్చినా ఇంకా దేవదాసి దురాచారం కొనసాగడం శోచనీయమన్నారు. షెడ్యూల్డ్ కులాల మహిళలపై సమాజంలో ఏదో ఒక దురాచారం పెత్తనం చేయడం శోచనీయమన్నారు. దేవతా, దేవుడి పేరు మీద మనుషులు చేస్తున్న దేవదాసి ఉదంతాలు అన్యాయమన్నారు. దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి ఎన్జీవోలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం చట్టాలు చేసినా ఇలాంటి దేవదాసి వ్యవస్థ సమాజంలో ఉండటం అంత మంచిది కాదన్నారు. చట్టంతో సంబంధం లేకుండా దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్సీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి మరియు వైస్ చైర్మన్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఈ వర్క్షాప్లో పలువురు పలు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఉన్న దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. వక్తల సూచనలు: దేవదాసి వ్యవస్థను నిషేధించే చట్టమే కాకుండా నిర్మూలన చేయడానికి చట్టం చేయాలని, చట్టం గురించి అవగాహన కల్పించాలని, ఆర్ధికంగా సహకారం అందించే పథకాలలో మార్పులు రావాలని, విద్యలో ముందుండే విధంగా చేయాలని, చట్టంలో మార్పులు చేర్పులు చేసి పదునైన చట్టంగా చేయాలని, దేవదాసి కేసులలో తల్లిదండ్రులను దోషులుగా చేయకుండా వారిని బాధితులుగా చూడాలని, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్టేట్లైన ఎమ్మార్వో, ఆర్డీవోలకు జ్యూడిషియల్ పవర్స్ ఇచ్చి పరిష్కరించే విధంగా తదితర సూచనలు వచ్చాయన్నారు. దేవదాసి నిషేధ చట్టం, 1988 మరియు నియమాలు 2015 పై దుర్గం సుబ్బారావు, రాజకుమార్లు రూపొందించిన బుక్ లెట్ను మంత్రులు అవిష్కరించారు. అదే విధంగా పలు జిల్లాల నుంచి వచ్చిన దేవదాసీలను, ఎన్జీవోలను, దేవదాసీ కుమార్తె అయిన సుశీల జాతీయ స్థాయి హాకీ క్రీడల్లో రాణిస్తున్నడంతో మంత్రులు ఆమెను సత్కరించారు. దేవదాసి వ్యవస్థ ముగింపు సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, స్టేట్ లిగల్ సెల్ అధ్యక్షులు కృపాసాగర్, వన్ మ్యాన్ కమిషన్ అధ్యక్షులు రఘునందన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి చల్లప్ప, దేవదాసి అక్కలు, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

  

Just In...