Published On: Thu, Sep 5th, 2019

సీఎం జగన్‌తో ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌’ ప్రతినిధుల భేటీ

సెల్ఐటి న్యూస్, అమరావతి: ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు’ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ తాడేపల్లి నివాసంలో ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి రూ.6వేల కోట్ల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టులకోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70శాతాన్ని బ్యాంకు మంజూరుచేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటుచేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈబ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లను రుణాలుగా మంజూరుచేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25వేల కోట్లు మంజూరు చేసింది.

Just In...