Published On: Fri, Sep 13th, 2019

నకిలీ టీ పొడిని తయారుచేస్తున్న ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి

* నిందితుడు అరెస్ట్

* సుమారు రూ.3.55 లక్షలు విలువైన కల్తీ టీ పొడి స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజయవాడ టాస్క్‌ఫోర్స్ వారికి రాబడిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏడిసిపి డాక్ట‌ర్  కె.వి.శ్రీనివాసరావు, ఏసిపిలు కె.సూర్యచంద్రరావు, వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి విజయవాడ, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గులాభీతోటలోని ఓ ఇంటిపై శుక్ర‌వారం దాడి చేశారు. ఇంట్లో గంటా భాస్కరరావు అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండ చట్ట వ్యతిరేఖంగా నకిలీ టీ పోడిని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాట్లు వెల్లడి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ.3.55 లక్షల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో…..గంటా భాస్కరావు అను అతను గత కొన్ని సంవత్సరాల నుండి విజయవాడ, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గులాభీతోటలోని ఒక ఇంటిలో నకిలీ టీ పొడిని తమిళనాడు, కోయంబత్తూర్ నుండి వేలంలో తక్కువ క్వాలిటీ కలిగిన టీ డస్ట్‌ను తీసుకువచ్చి, దానికి సింథ‌టిక్ కలర్స్ అయిన టెట్రాజిన్, సన్ సెట్ అనే పదార్ధాలను కలిపిన దానిని అనేక టీ స్టాల్స్ కు సరఫరా చేస్తున్నాడు. ఈ కృత్రియ రంగులు టీ పొడికి మంచి రంగు ఇవ్వడంతో పాటు టీ పౌడర్ యొక్క పరిమాణం తగించుకొని ఎక్కువ టీలు తయారు చేయుటకు ఉపయోగపడుతుంది. ఈ హానికరమైన పదార్థాల కలయకతో తయారు చేసిన టీని త్రాగిన వారికి మైగ్రాన్ తలనొప్పి, నరాల బలహీనత మరియు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా గంటా భాస్కరావు రోజుకు 150 నుండి 200 కేజీల వరకు కల్త్ టీ పొడిని ఏపీలోని ముఖ్య పట్టణాలైన గుంటూరు, మంగళగిరి, గిద్దలూరు, సత్తెనపల్లి, ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఉయ్యూరు, పామర్రులతో పాటు తెలంగాణా రాష్ట్రంలోని ఆర్మురు, హైదరాబాద్ మొదలగు అనేక ప్రాంతాలకు తన సేల్స్ బాయ్‌ ద్వారా ప్రతి రోజు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు కల్తీ చేయబడిన టీ పొడి ప్యాకెట్లను రూ.150 నుండి రూ. 200 ధరకు అమ్ముచున్నట్లు వెల్లడైనది. బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్ టీ పొడి ప్యాకెట్ రూ.300 నుండి రూ.400 ధరకు అమ్ముచుండగా, టీ స్టాల్ యజమానులు ఈ కల్తీ టీ పొడిని తక్కువ ధరకు కొని లాభాలు గడిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజా ఆరోగ్యానికి హాని కల్గిస్తున్నారు. నిందితుని వద్ద నుండి సుమారు రూ.3,55 లక్షల విలువ చేసే 1,200 కేజీల నాసిరకం టీ పొడి, 452 కేజీల కల్తీ చేయబడిన టీ పొడి మరియు 142 కేజీల సింథ‌టిక్ రంగు అయిన టెట్రాజిన్ కలిపిన టీ పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Just In...