Published On: Sun, Oct 6th, 2019

దుర్గ‌మ్మ‌కు తితిదే నుంచి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్ప‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: హిందూ ధ‌ర్మాన్ని, సంప్ర‌దాయాల‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్‌థానం ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఇంద‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు తితిదే త‌ర‌ఫున వై.వి.సుబ్బారెడ్డి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లింప‌ల్లి శ్రీనివాస్, దుర్గ‌గుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు స్వాగ‌తం ప‌లక‌గా అనంత‌రం పూర్ణ‌కుంభంతో ఆల‌య మ‌ర్యాద‌ల‌తో వేద మంత్రాల న‌డుమ అమ్మ‌వారికి వైవీ సుబ్బారెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆల‌య అర్చ‌కులు అమ్మ‌వారి ఆశీర్వ‌చ‌నాలు అందించ‌గా, ఈవో సురేష్‌బాబు తీర్థ‌ప్ర‌సాదాలు, అమ్మ‌వారి చిత్ర‌ప‌టాన్ని అందించారు. అనంత‌రం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలో అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాలు, ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు విజ‌య‌వంతంగా అమ‌లు జ‌రిగేలా క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ఆశీస్సుల‌తో సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని అమ్మ‌వారిని వేడుకున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో హిందూ స‌నాత‌న ధ‌ర్మాన్ని, మ‌న సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో న‌ర్స‌పురం పార్ల‌మెట్ స‌భ్యులు ర‌ఘురామ‌రాజు, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.  

Just In...