Published On: Sat, Oct 12th, 2019

ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి గత ప్రభుత్వమే కారణం

* ఏకంగా రూ.42 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌

* కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడిగా అప్పులు

* అన్నీ కలిపి మొత్తం రూ.65 వేల కోట్ల బిల్లులు

* ఒక్కొక్కటిగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం

* ఏపి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రకటన

సెల్ఐటి న్యూస్‌, a రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం, డైట్‌ ఛార్జీలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్థానిక సంస్థలు, ఆస్పత్రుల్లో ఔషధాలు.. చివరకు దూది వంటి వాటికి   కూడా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా మొత్తం రూ.42 వేల కోట్లు బకాయి పడిందని ఆయన వెల్లడించారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా 9 నెలల నుంచి 12 నెలల పాటు వేతనాలు చెల్లించలేదని తెలిపారు. వీటితో పాటు వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులను కూడా దారి మళ్లించారని, ఆ విధంగా అన్నీ కలుపుకుంటే గత టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.65 వేల కోట్ల బిల్లులు (చెల్లించాల్సిన మొత్తం) పెండింగ్‌లో పెట్టిందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా దిగిపోయే ముందు రూ.5 వేల కోట్లకు మించి బిల్లులు పెండింగ్‌లో ఉంచదని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఆ అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా సరి చేస్తున్నామని అన్నారు. అటు విద్యుత్‌ సంస్థలకు కూడా టీడీపీ ప్రభుత్వం సబ్సిడీ కానీ, ఇతర బిల్లులు కానీ సక్రమంగా చెల్లించలేదని మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. విద్యుత్‌ సంస్థలకు గత ప్రభుత్వం మొత్తం రూ.రూ.14,857 కోట్లు బకాయి పడిందని, మరోవైపు విద్యుత్‌ ఉత్పత్పి సంస్థలకు కూడా రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కేవలం 45 రోజులలో 25 ఏళ్ల కోసం 36 విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న టీడీపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి ఎంతో నష్టం కలగజేసిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ సరఫరాలో స్వల్ప అంతరాయాలు, మద్యం విక్రయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, పలువురు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశంలో థీటుగా బదులిచ్చారు. అన్నింటినీ వివరించిన ఆయన, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను ఎండగట్టారు.

ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌…
రాష్ట్ర విద్యుత్‌ ఆర్థిక సంస్థ రూ.3 వేల కోట్ల అప్పు కోసం ఎస్బీఐని ఆశ్రయిస్తే క్రిసల్, బ్రిక్‌వర్క్‌ సంస్థలు రేటింగ్‌ ఇవ్వకపోవడంతో తిరస్కరించారని టీడీపీ ప్రచారం చేస్తోందని మంత్రి అన్నారు. వాస్తవానికి ఆ రేటింగ్స్‌ చాలా గోప్యంగా ఉంటాయని, అలాంటప్పుడు అవి బయటకు ఎలా వచ్చాయో తెలియడం లేదని చెప్పారు. అయితే నిజానికి ఎస్బీఐ ప్రభుత్వ ఔట్‌ స్టాండింగ్‌ గ్యారెంటీని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు. 2017లో కేవలం రూ.9665 కోట్లు ఉన్న ఆ గ్యారెంటీ మొత్తం 2018 వచ్చే నాటికి రూ.35,964 కోట్లకు పెరగడాన్ని బ్యాంక్‌ ప్రశ్నించిందని, ఆ సమయంలో అధికారంలో ఉంది టీడీపీయే అని వివరించారు. ఎవరైనా పనితీరును బేరీజు వేసేందుకు కేవలం 3 నెలల వ్యవధిని చూస్తారా? లేక గత 5 ఏళ్లను పరిగణలోకి తీసుకుంటారా? అని మంత్రి ప్రశ్నించారు.
త‌మ ప్రభుత్వంపై విశ్వాసం వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై బ్యాంకులకు ఇప్పటికే విశ్వాసం పెరిగిందన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అందుకు ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌గా ఆర్బీఐ నుంచి తీసుకునే రుణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు 7న రూ.1000 కోట్లు కావాలని కోరితే, అది రూ.2005 కోట్లుగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిందని మంత్రి వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ప్రతిరూపమని, ఎంతో నమ్మకం ఉంటేనే ఆ మొత్తం రుణంగా ఇస్తారని చెప్పారు.

ఓడీ లేదు ….
రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మూడు నెలల్లో ఒక్క రోజు కూడా ఓడీ (ఓవర్‌ డ్రాఫ్ట్‌)కి వెళ్లలేదని మంత్రి వెల్లడించారు. ఇది తమ ఆర్థిక క్రమశిక్షణ అంటూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నెన్ని రోజులు ఓడీకి వెళ్లారన్న విషయాన్ని ప్రస్తావించారు.
2018–19లో టీడీపీ ప్రభుత్వం 43 రోజులు ఓడీకి వెళ్లగా, అందులో ఒక్క ఏప్రిల్, మే నెలలోనే 14 రోజులు ఉన్నాయని చెప్పారు. ఇంకా తమ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు, ఈ ఏడాది జూన్‌లో కూడా 8 రోజులు ఓడీకి వెళ్లారని తెలిపారు.
విద్యుత్‌ రంగంపై అసత్యాలు రాష్ట్రంలో విద్యుత్‌ రంగంపైనా టీడీపీ అనేక అసత్యాలు ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ రంగంలో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
డిస్కమ్‌లకు సబ్సిడీ బకాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018–19లో ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.6030 కోట్లు సబ్సిడీ చెల్లించాల్సి ఉండగా, బడ్జెట్‌లో రూ.2500 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. చివరకు అందులోనూ సగమే అంటే రూ.1250 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఆ సబ్సిడీ ఇప్పుడు ఏకంగా రూ.4780 కోట్లకు చేరిందని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు మొత్తం రూ.9256 కోట్ల సబ్సిడీ బకాయి పడిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం వాడుకున్న విద్యుత్‌ బిల్లులు మరో రూ.5601 కోట్లు అని, అలా డిస్కమ్‌లకు టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.14,857 కోట్లు బకాయి పడిందని వివరించారు. మరోవైపు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల (సరఫరాదారులు)కు కూడా టీడీపీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు బకాయి పడిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగంలో నష్టం రూ.7200 కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు.

అసంబద్ధ పీపీఏలు…
చౌకలో థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులో ఉన్నా, టీడీపీ ప్రభుత్వం పవన విద్యుత్‌ కొనుగోలు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. దీని వల్ల రూ.2760 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. మరోవైపు 2017లో కేవలం 45 రోజుల వ్యవధిలో 25 ఏళ్లకు సంబంధించి 36 విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నారని మంత్రి తెలిపారు.

మద్యం ధరలు పెంచింది చంద్రబాబే…
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడిన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ దిశలో పలు చర్యలు చేపడుతోందని, అందుకే మద్యం షాపులను 3500 కు తగ్గించిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా నేరుగా అమ్మకాలు సాగించడం వల్ల రిటైలర్ల కమిషన్‌ కూడా ప్రభుత్వానికి ఆదాయంలా వస్తోందని చెప్పారు. మద్యంపై చంద్రబాబు 2015లో 78శాతం ఎక్సైజ్‌ డ్యూటీ విధించారని, ఆ తర్వాత 2017 జూలైలో అదనంగా ఎక్సైజ్‌ డ్యూటీ విధించారని గుర్తు చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన అప్పులు…
రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.23 లక్షల కోట్ల అప్పులు ఉండగా, అది రూ.2.58 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు వివిధ శాఖలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం అప్పులు రూ.3.62 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు.

రూ.42 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌…
టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే నాటికి వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి రూ.42 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని మంత్రి చెప్పారు. నిజానికి ఏ ప్రభుత్వం అయినా అధికారంలో నుంచి దిగి పోయేటప్పుడు రూ.5 వేల కోట్ల వరకు మాత్రమే బిల్లులు పెండింగ్‌లో పెడుతుందని తెలిపారు. మరోవైపు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే రూ.3358 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారని తెలిపారు. అందులో కేవలం 8 మంది కాంట్రాక్టర్లకు రూ.1067 కోట్లు బిల్లులుగా ఇచ్చారని చెప్పారు. అదే విధంగా గత ఏడాది అక్టోబరులో రూ.550 కోట్లు, నవంబరులో రూ.769 కోట్లు, డిసెంబరులో రూ.1000 కోట్లకు పైగా, ఈ ఏడాది జనవరిలో రూ.900 కోట్లకు పైగా, ఫిబ్రవరిలో రూ.600 కోట్లకు పైగా బిల్లులు చెల్లించారని చెప్పారు. అదే విధంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక్క రోజులోనే రూ.5 వేల కోట్ల అప్పు చేశారని మంత్రి వివరించారు.

కార్పొరేషన్ల పేరుతో అప్పులు…
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (ఏపీ సీఎస్‌సీ) ద్వారానే ఈ ఏడాదిఒ జనవరి 25 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రూ.4800 కోట్ల అప్పు తీసుకున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు 2014లో కేవలం రూ.6 వేల కోట్ల అప్పులు ఉండగా, టీడీపీ అధికారం కోల్పోయే నాటికి ఆ రుణమొత్తం రూ.20 వేల కోట్లకు చేరిందని తెలిపారు.

తలసరి ఆదాయం…
మరోవైపు తలసరి ఆదాయం కూడా గతంలో పోల్చుకుంటే, టీడీపీ హయాంలో ఆశించిన స్థాయిలో పెరగలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. 2003–04లో తలసరి ఆదాయం రూ.25,990 కాగా, 2013–14 నాటికి 335 శాతం పెరిగిన తలసరి ఆదాయం రూ.85,797 కోట్లకు చేరిందని తెలిపారు. ఆ తర్వాత 2014–15లో తలసరి ఆదాయం రూ.94 వేలు కాగా, 2019 నాటికి కనీసం 165 శాతం పెరగాల్సి ఉందని, కానీ కేవలం 75శాతం మాత్రమే పెరిగి రూ.1,42,542 కు చేరిందని వివరించారు. పారిశ్రామిక రంగం పురోగతి 25శాతం నుంచి 22 «శాతానికి తగ్గగా, సేవా రంగం కూడా 44 శాతం నుంచి 42 శాతానికి తగ్గిపోయిందని చెప్పారు. ఎన్నికల ముందు హడావిడిగా రూ.38 వేల కోట్ల సప్లిమెంట్‌ గ్రాంట్‌ తీసుకున్న టీడీపీ ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఖర్చు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. రూ.42 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులతో పాటు, వివిధ కార్పొరేషన్ల రుణాలు రూ.16 వేల కోట్లు, ఒకే రోజు చేసిన రూ.5 వేల కోట్ల అప్పు అన్నీ కలుపుకుంటే గత ప్రభుత్వం తమపై దాదాపు రూ.65 వేల కోట్ల భారం వేసిందని (ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం) మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అన్నీ ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తున్నామని, వచ్చే డిసెంబరు నాటికి వీలైనంత వరకు క్లియర్‌ చేస్తామని మంత్రి వివరించారు.

Just In...