Published On: Thu, Oct 31st, 2019

బీడువారిన నేలను మాగాణిలా మార్చాలి

* మంత్రి మేకపాటి మొక్కవోని దీక్ష

* జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో మంత్రి మేకపాటి భేటీ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 ప్రారంభానికి పనుల కదలికలో పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ , జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో తీవ్ర వర్షాభావం ఉండే మెట్టప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల కలను సాకారం చేసే ప్రక్రియలో మంత్రి మేకపాటి వేగం పెంచారు. బుధవారం ఉదయం సచివాలయంలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -2 పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చొరవచూపాలని మంత్రి మేకపాటి కోరారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఎకరాకు నీరందేలా ఫేజ్-2 పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంపై సహకరించాలన్నారు. టెండర్లను పిలిచి పనులు పరుగులు పెట్టించి రాబోయే సాగు సమయానికి నీరందించేలా చేయాలని కోరారు. అందుకోసం రూపొందించిన పూర్తి వివరాలను డాక్యుమెంట్ రూపంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి అందించారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని సుమారు 100 గ్రామాల రైతాంగానికి వేలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగు నీరు అందించేందుకు చొరవచూపాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను మేకపాటి కోరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పనులను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు మంత్రి మేకపాటి. సోమశిల రిజర్వాయర్ ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు సమీపంలోనే ఉన్నా కాలువలు లేక నీరు అందక అక్కడి రైతాంగం పడుతున్న ఇబ్బందులను మరోమూరు సంబంధిత శాఖ మంత్రి అనిల్ యాదవ్‌కు వివరించారు. గత ఐదారేళ్లలో వర్షం లేక, కాలువల్లో నీరు కరవై పొట్టకూటి కోసం వలస వెళుతున్న పల్లె ప్రజల అవస్థలను తీర్చేందుకు సహకరించాలని కోరారు. తానూ నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రిగా సోమశిల ప్రాజెక్టు పనుల పూర్తిలో తన భాగస్వామ్యం, సహకారం సంపూర్ణంగా అందిస్తానని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

Just In...