Published On: Tue, Nov 12th, 2019

వెంకయ్యకు జగన్‌ క్షమాపణ చెప్పాలి..

* భాజ‌పా ఏపి అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ  

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వెంకయ్యపై పట్ల జగన్ వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. ఉప రాష్ట్రపతిపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్య పాత్ర మరువలేనిదని, ఆయన ఏ పదవిలో ఉన్నా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో పెద్దల పట్ల ఇలా మాట్లాడటం మంచిపద్దతి కాదని కన్నా హితవుపలికారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్‌ మీడియాన్ని తీవ్రంగా వ్వతిరేకించారని గుర్తుచేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలుగుభాషకు ప్రాచీనహోదా తెచ్చుకున్నామని, మాతృభాషను చంపుతామంటే తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటానికి తాము ఎప్పుడూ సిద్దంగా ఉంటామని స్పష్టం చేశారు. ఇసుక సమస్యను మొదట లేవనెత్తింది తామేనని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై ఏ పార్టీ పోరాటం చేసినా తమ మద్దతు ఉంటుందని, మద్యం పాలసీని వెంటనే అమలు చేసిన ప్రభుత్వం ఇసుక పాలసీని ఎందుకు అమలు చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

Just In...